Telugu Global
Telangana

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఎమ్మెల్సీ ఖాళీల భర్తీపై కీలక నిర్ణయం?

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది.

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఎమ్మెల్సీ ఖాళీల భర్తీపై కీలక నిర్ణయం?
X

కొత్తగా ప్రారంభించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటీవ్, పార్లమెంటరీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన మరుసటి రోజే కేబినెట్ భేటీ జరుగనుండటం ప్రాధాన్యత సంతరించుకున్నది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధంచి చర్చ జరుగనున్నది.

దళిత బంధ పథకం, గొర్రెల పంపిణీ, గృహ లక్ష్మీ పథకం, పోడు భూముల లబ్దిదారులకు పట్టాల పంపిణీ వంటివి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటని వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అలాగే జూన్ 2 నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు అవుతుంది. అదే సమయంలో రాష్ట్రంలో 21 రోజుల పాటు దశాబ్ది అవతరణ ఉత్సవాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గత తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు.

ఎమ్మెల్సీ పదవులపై చర్చ?

శాసన మండలిలో ఖాళీ అవుతున్న రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కేబినెట్‌లో చర్చ జరుగనున్నట్లు తెలుస్తున్నది. ఈ పదవుల్లో ఎవరినీ భర్తీ చేయాలనే విషయంపై చర్చించి, గవర్నర్‌కు సిఫార్సు చేయనున్నారు. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని సిఫార్సు చేసి పంపగా.. గవర్నర్ పలు కారణాలతో తిరస్కరించారు. దీంతో ఈ సారి అన్ని జాగ్రత్తలు తీసుకొని సరైన వ్యక్తులను ఎంపిక చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఈ నెలాఖరుకు డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్‌ల పదవీ కాలం ముగియనున్నది. డి. రాజేశ్వర్ రావు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు, అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో ఒక సారి ఎమ్మెల్సీగా పని చేశారు. దీంతో ఆయన స్థానంలో మరొకరికి అవకాశం దక్కవచ్చు. రాష్ట్రంలోని పలువురు క్రైవవ నాయకులు ఎమ్మెల్సీ కావాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ నాయకుడు రోడెన్ రోచ్ ఈ పదవిపై ఆశ పెట్టుకున్నారు. అలాగే తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ లీడర్ గోనె సాల్మన్ రాజు కూడా తనకు పదవి వస్తుందని ఆశిస్తున్నారు. పదవీ కాలం ముగుస్తున్న ఫారూఖ్ హుస్సేన్ తనకు మరో దఫా పొడిగింపు లభిస్తుందని భావిస్తున్నారు. కాగా, ఈ రెండు ఖాళీల భర్తీ విషయంలో ఇవ్వాల్టి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.

First Published:  18 May 2023 8:41 AM IST
Next Story