Telugu Global
Telangana

TS స్థానంలో TG.. కాంగ్రెస్ మార్కు మరో మార్పు

ఈరోజు సాయంత్రం జరిగే తెలంగాణ కేబినెట్ భేటీలో లాంఛనంగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపే అవకాశముంది. బడ్జెట్ సమావేశాల ముందు జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మంత్రిమండలి.

TS స్థానంలో TG.. కాంగ్రెస్ మార్కు మరో మార్పు
X

తెలంగాణలో వాహనాల నెంబర్ ప్లేట్లపై TS అనే అక్షరాల స్థానంలో ఇకపై TG అనే అక్షరాలు కనపడతాయి. దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈరోజు సాయంత్రం జరిగే తెలంగాణ కేబినెట్ భేటీలో లాంఛనంగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపే అవకాశముంది. బడ్జెట్ సమావేశాల ముందు జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మంత్రిమండలి. పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనే హామీల అమలుకి కూడా ఈ మీటింగ్ లోనే స్పష్టత వస్తుంది.

ఎందుకీ మార్పు..?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ APగా అందరికీ సుపరిచితం. విభజన తర్వాత కూడా ఏపీకి ఆ పేరు మిగిలిపోయింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణను పొడి అక్షరాల్లో కొందరు TGగా ప్రస్తావించేవారు. రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత కొంతమంది వాహనాలపై TG అనే అక్షరాలు రాయించుకున్నారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ స్టేట్(TS) అనే గుర్తింపు తీసుకొచ్చింది. వాహనాల నెంబర్ ప్లేట్లపై కూడా అవే అక్షరాలు వచ్చాయి. అప్పట్లో దీన్ని కొందరు వ్యతిరేకించారు కూడా. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన మార్కు చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రగతి భవన్ పేరు మార్పు సహా.. ఇతరత్రా వ్యవహారాలే దీనికి ఉదాహరణలు. తాజాగా TSని TGగా మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది.

ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా..?

ఇందిరమ్మ రాజ్యం అంటే పేర్లు మార్చడమేనా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పాలన పక్కనపెట్టి పేర్లు మారుస్తూ కాలక్షేపం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. స్టాఫ్ నర్సుల పోస్ట్ లను తాము భర్తీ చేస్తే.. అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చి కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకున్నారని, ఇలాంటి జిమ్మిక్కులతోనే కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని.. ఆరు గ్యారెంటీల అమలుని వాయిదా వేస్తూ ప్రజల్ని మోసం చేస్తోందని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

First Published:  4 Feb 2024 8:28 AM IST
Next Story