నేడు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ..
ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, వైద్య విద్య అధిపతుల వయో పరిమితి బిల్లు, మున్సిపల్ నిబంధనలు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు వంటి వాటిపై కేబినెట్ లో చర్చ జరుగుతుంది.
భారీ వర్షాలు, వరదలతోపాటు దాదాపు మరో 50 అంశాలపై చర్చించేందుకు ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఆగస్టు 3 నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ భేటీలోనే చర్చించే అవకాశముంది. ఎన్నికలకు టైమ్ దగ్గరపడటంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ మొదలవుతుంది.
రెండో సమావేశం..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం అయిన తర్వాత ఇక్కడ రెండోసారి కేబినెట్ భేటీ జరగబోతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది. ప్రాణ నష్టాన్ని వీలైనంత మేర నివారించగలిగారు కానీ, ఆస్తి, పంట నష్టం మాత్రం తప్పలేదు. ఈ సందర్భంగా నష్టాన్ని అంచనా వేసి, పరిహారంపై నిర్ణయం తీసుకుంటుంది కేబినెట్. దాదాపు 3వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. రోడ్ల పునరుద్ధరణ, చెరువుల మరమ్మతులు వంటి వాటిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.
రైతు రుణ మాఫీ అంశంపై కూడా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, వైద్య విద్య అధిపతుల వయో పరిమితి బిల్లు, మున్సిపల్ నిబంధనలు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు వంటి వాటిపై కేబినెట్ లో చర్చ జరుగుతుంది. గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను సభలో ప్రవేశపెట్టి మరోసారి సభ ఆమోదం తీసుకోవడంపై కూడా కేబినెట్ లో చర్చిస్తారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి జీతాల పెంపు బిల్లుకి కూడా ఈ రోజు లాంఛనంగా ఆమోద ముద్ర వేస్తారు.