Telugu Global
Telangana

రెండు, మూడు రోజుల్లో టీ-కేబినెట్ మీటింగ్‌.. కీలక నిర్ణయాలు..!

ఇటీవల జిల్లాల పర్యటనల సందర్భంగా కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నింటికి మంత్రివర్గం ఆమోదం అవసరం. మరికొన్ని నిర్ణయాల విషయంలో నేతల నుంచి విజ్ఞప్తులు ఉన్నాయి.

రెండు, మూడు రోజుల్లో టీ-కేబినెట్ మీటింగ్‌.. కీలక నిర్ణయాలు..!
X

రెండు, మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్‌ భేటీ జరిగే అవకాశాలున్నాయి. ఈనెలాఖరులోపు మంత్రిమండ‌లి స‌మావేశం జరగవ‌చ్చని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. వచ్చే నెల 10వ తేదీలోపు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం ప్రధానంగా చర్చకు రానుంది. వేతన సవరణ కోసం కమిషన్‌తో పాటు మధ్యంతర భృతి ఇస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు.

కేబినెట్ మీటింగ్‌లో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అవసరం అనుకుంటే అంతకు ముందే ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశమవుతారని తెలుస్తోంది. ఇటీవల జిల్లాల పర్యటనల సందర్భంగా కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నింటికి మంత్రివర్గం ఆమోదం అవసరం. మరికొన్ని నిర్ణయాల విషయంలో నేతల నుంచి విజ్ఞప్తులు ఉన్నాయి. గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం గత మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించారు. వారికి అర్హత లేదని, కేవలం సమ్మరీ మాత్రమే ఇచ్చారని, సమగ్ర వివరాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదే అంశంపై మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావు, ప్రశాంత్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులతో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ఏవైనా బిల్లులను వెనక్కి పంపితే ఉభయసభల్లో మళ్లీ ఆమోదించి పంపే వెసులుబాటు ఉంటుందని, నామినేటెడ్ ఎమ్మెల్సీల వ్యవహారంలో నిర్దిష్ట విధానం అంటూ ఏది లేదని చెప్తున్నారు. వారి పేర్లను మళ్లీ సిఫార్సు చేయాలని ప్రభుత్వం భావిస్తే..కేబినెట్‌లో ఆ అంశం కూడా చర్చకు రానుంది. మంత్రివర్గంలో మళ్లీ రెండు పేర్లను ఆమోదించి.. అన్ని వివరాలతో దస్త్రాన్ని మళ్లీ రాజ్‌భవన్‌కు పంపే విషయమై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గ సమావేశానికి సంబంధించి నేడో, రేపో స్పష్టత రానుంది.

First Published:  26 Sept 2023 5:07 AM
Next Story