Telugu Global
Telangana

అందరి చూపూ ప్రగతి భవన్ వైపే..

ఇవ్వాళ టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌తో పాటు కేబినెట్ సమావేశాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేశారు. గత రెండు రోజులుగా బీహార్‌లో పర్యటించి వచ్చిన సీఎం.. ఇక తన భవిష్యత్ ప్రణాళికను ఈ రోజు వెల్లడిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు.

అందరి చూపూ ప్రగతి భవన్ వైపే..
X

తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ప్రగతి భవన్ నుంచి వచ్చే వార్త కోసం ఎదురు చూస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఇవ్వాళ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతుంది. ముందస్తు ఎన్నికలు లేదా జాతీయ రాజకీయాలపై ప్రకటన చేస్తారని అందరూ భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రాక ముందే కేసీఆర్ ఏం చెప్తారో అని అందరూ ప్రగతి భవన్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఇవ్వాళ టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌తో పాటు కేబినెట్ సమావేశాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేశారు. గత రెండు రోజులుగా బీహార్‌లో పర్యటించి వచ్చిన సీఎం.. ఇక తన భవిష్యత్ ప్రణాళికను ఈ రోజు వెల్లడిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఇవ్వాళ కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. రాజకీయ అంశాలను పక్కన పెడితే.. గవర్నర్ అధికారాలను తగ్గించే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్‌ను సవరించి గవర్నర్‌కు వైస్ ఛాన్సలర్ హోదాను తీసివేసే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతే కాకుండా.. తెలంగాణ వజ్రోత్సవాల పేరుతో కార్యక్రమాల నిర్వహణపై కూడా చర్చించనున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చినా.. తెలంగాణ (హైదరాబాద్ స్టేట్‌) 1948 సెప్టెంబర్ 17న ఇండియన్ యూనియన్‌లో కలిసింది. దీంతో వచ్చే ఏడాది తెలంగాణ వజ్రోత్సవాల పేరుతో భారీ కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తుంది.

గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ 17 విషయంలో బీజేపీ.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. విమోచనం దినం పేరుతో బీజేపీ ప్రతీ ఏడాది సెప్టెంబర్ 17న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎంఐఎంకు భయపడి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని విమర్శలు చేస్తోంది. వీటికి చెక్ పెడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఈసారి సెప్టెంబర్ 17 నుంచి భారీ కార్యక్రమాల నిర్వహణకు సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించిన నిర్ణయాలు ఈ రోజు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

ఇక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీబీఐ.. బీజేపీయేతర రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏపీలోకి సీబీఐ ఎంటర్ కాకుండా ఓ చట్టాన్ని తీసుకొని వచ్చింది. అదే మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం కూడా సీబీఐని తెలంగాణలోకి రాకుండా షరతులు విధించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని ఇవ్వాళ్టి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆ సమావేశంలో ఈ ప్రతిపాదనకు అనుమతి లభిస్తే.. సీబీఐ విషయంలో ఓ చట్టం రావడం ఖాయమే. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇకపై సీబీఐ తెలంగాణలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలుండదు.

కేబినెట్ మీటింగ్ ఇవ్వాళ మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రగతిభవన్‌లో జరుగనుండగా.. టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ సాయంత్రం 6 గంటల తర్వాత తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నారు. ఈ రెండు సమావేశాల్లో కేసీఆర్ కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారనే వార్తలు వెలువుడుతున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

First Published:  3 Sept 2022 8:36 AM IST
Next Story