Telugu Global
Telangana

ఈ నెల 9న తెలంగాణ కేబినెట్ భేటీ.. కొత్త పీఆర్సీపై నిర్ణయం?

కొత్త క్రీడా విధానంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొని రానున్న ఈ కొత్త క్రీడా విధానం ముసాయిదాకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.

ఈ నెల 9న తెలంగాణ కేబినెట్ భేటీ.. కొత్త పీఆర్సీపై నిర్ణయం?
X

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 9న కీలక మంత్రిమండలి సమావేశం జరుగనున్నది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు. ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కొంత కాలం నుంచి కొత్త పీఆర్సీ కోసం డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే కొత్త పీఆర్సీ అమలు చేయాలని వినతులు వస్తుండటంతో.. దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే విద్యుత్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై సర్కారు నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

ఇక ఈ సారి యాసంగి సీజన్‌కు సంబంధించిన దొడ్డు బియ్యం కొనుగోలుపై మరోసారి కేంద్రం పేచీ పెడుతోంది. ఆఖరి నిమిషంలో కేంద్రం చేతులెత్తేస్తే రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే ఈ సారి కూడా ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రాబోయే వానాకాలం సీజన్‌లో సాగుకు కావల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని.. ఇతర సన్నద్దతలపైనా మంత్రి మండలి దిశానిర్దేశం చేయనున్నది.

కొత్త క్రీడా విధానంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొని రానున్న ఈ కొత్త క్రీడా విధానం ముసాయిదాకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. మెస్ చార్జీల పెంచాలని మంత్రి వర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను కేబినెట్ ఆమోదం తెలుపనున్నది. ఇక ఇటీవల బీఆర్కే భవన్‌లో సమావేవం అయిన మంత్రి మండలి ఉప సంఘం.. ఇళ్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు ఆర్థిక సాయం వంటి విషయాల్లో కొన్ని సిఫార్సులు చేసింది. వీటిపై కేబినెట్‌లో చర్చ జరుగనున్నది. పోడు భూములపై హైకోర్టు జారీ చేసిన నోటీసుకు ఎలాంటి సమాధానం ఇవ్వాలనే విషయాలపై కూడా చర్చ జరుగనున్నది. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చిస్తారు.

First Published:  5 March 2023 12:38 PM IST
Next Story