రుణమాఫీపై టీ.కేబినెట్ కీలక నిర్ణయం
దాదాపు 31 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. రుణమాఫీపై త్వరలోనే జీవో విడుదల చేస్తామన్నారు. నియమనిబంధనలు జీవోలోనే పొందుపరుస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ రుణమాఫీ, రైతు భరోసా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా రైతు రుణమాఫీపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు సీఎం రేవంత్. ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు రేవంత్. వ్యవసాయం దండగ కాదు, పండుగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానమన్నారు.
12 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/bpCeQ7Jee9
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2024
కేసీఆర్ ప్రభుత్వం రెండు విడతల్లో రూ.28 వేల కోట్ల రైతు రుణాలు మాత్రమే మాఫీ చేసిందన్నారు రేవంత్. గత ప్రభుత్వం 2018 డిసెంబర్ 11ను కటాఫ్ తేదీగా తీసుకుందన్నారు. దీంతో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే మాఫీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు రేవంత్. ఇందుకోసం దాదాపు 31 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. రుణమాఫీపై త్వరలోనే జీవో విడుదల చేస్తామన్నారు. నియమనిబంధనలు జీవోలోనే పొందుపరుస్తామన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలల్లోగా అంటే ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు.
ఇక రైతు భరోసా కింద ఏటా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రైతుభరోసా అర్హులను నిర్ణయించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు చెప్పారు రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కేబినెట్ సబ్ కమిటీ పనిచేస్తుందన్నారు. ఇందులో సభ్యులుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉంటారని చెప్పారు. జూలై 15 లోగా కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పిస్తుందని.. ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత అందరి సూచనలతో రైతు భరోసా అమలు చేస్తామన్నారు.
ఇక మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదన్నారు రేవంత్. మంత్రి వర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పాలనపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యతను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటారని చెప్పారు. వారిద్దరు ఇచ్చే సమాచారం మాత్రమే అధికారిక సమాచారం అన్నారు రేవంత్.