కేబినెట్ విస్తరణ.. రేవంత్‌పై పెరుగుతున్న ఒత్తిడి..!
కేబినెట్‌లో మిగిలిన ఆరు స్థానాల కోసం దాదాపు 12 మందికిపైగా నేతలు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ స్థానాలను ఇతరులకు వదులుకున్న నేతలు, ఎన్నికల్లో ఓడిన ప్రముఖ లీడర్లు, ఏళ్ల తరబడి పార్టీకి సేవలందిస్తున్న సీనియర్ నేతలు కేబినెట్‌లో బెర్త్ కోసం లాబీయింగ్ స్టార్ట్ చేశారు.
తెలంగాణ కేబినెట్‌లో మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆరు స్థానాల కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఇతరుల కోసం సీటును వదులుకున్న నేతలు, పార్టీకి ఏళ్లుగా సేవలందిస్తున్న సీనియర్లు మంత్రి పదవి కోసం ఆశ పడుతున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
కేబినెట్‌లో మిగిలిన ఆరు స్థానాల కోసం దాదాపు 12 మందికిపైగా నేతలు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ స్థానాలను ఇతరులకు వదులుకున్న నేతలు, ఎన్నికల్లో ఓడిన ప్రముఖ లీడర్లు, ఏళ్ల తరబడి పార్టీకి సేవలందిస్తున్న సీనియర్ నేతలు కేబినెట్‌లో బెర్త్ కోసం లాబీయింగ్ స్టార్ట్ చేశారు. వరుసగా రెండు, మూడు సార్లు ఓడిన నేతలు సీనియర్లు అయినప్పటికీ.. వారికి కేబినెట్‌లో స్థానం ఇవ్వకూడదని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ కారణంగానే మాజీ మంత్రి షబ్బీర్ అలీని మంత్రి వర్గంలోకి తీసుకోలేదని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా గెలవలేదు. దీంతో కేబినెట్‌లో బెర్తు కోసం మహ్మద్ అజారుద్దీన్, షబ్బీర్ అలీ మధ్య పోటీ నడుస్తోంది.
వీరితో పాటు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.. గ్రేటర్ హైదరాబాద్ నుంచి కేబినెట్ రేసులో ఉన్నారు. ఇక జగిత్యాలలో ఓడిన జీవన్ రెడ్డి, సంగారెడ్డిలో ఓడిన జగ్గారెడ్డి కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వీరితో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వినోద్, వివేక్, ప్రేమ్ సాగర్ రావు.. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నారు. కాగా, రంగారెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని ఒకరికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
కేబినెట్‌లో ఆరు బెర్తులకు సమానంగా మండలిలోనూ ఆరు ఖాళీలున్నాయి. ఈ ఎమ్మెల్సీ సీట్ల కోసం ఇతరుల కోసం సీటు త్యాగం చేసిన నేతలు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం పొంది తర్వాత మంత్రులు కావాలని ఆశిస్తున్నారు. వీరిలో తుంగతుర్తి సీటును త్యాగం చేసిన అద్దంకి దయాకర్, రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరిన వేం నరేందర్ రెడ్డి, మెగారెడ్డి కోసం వనపర్తి సీటు వదులుకున్న చిన్నారెడ్డి కూడా ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవులు పొందాలని భావిస్తున్నారు. ఈ ముగ్గురు రేవంత్ రెడ్డికి నమ్మకస్తులే. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు గవర్నర్ కోటాలో ఉన్నాయి. వీటిని తక్షణమే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఇక రెండు ఖాళీలు ఎమ్మెల్యే కోటాలో ఉండగా.. గ్రాడ్యుయేట్ కోటాలో ఒకటి, స్థానిక సంస్థల కోటాలో మరొక స్థానం ఖాళీగా ఉన్నాయి.