Telugu Global
Telangana

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..

కేబినెట్ మీటింగ్ లో దళితబంధు అమలుపై చర్చ జరిగింది. రెండో విడతలో 1.3 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
X

తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు ఐదుగంటల పాటు మంత్రిమండలి సమావేశం జరిగింది. కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి హరీష్ రావు ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. దళితబంధు, గృహలక్ష్మి, పోడు భూములకు పట్టాలు వంటి అంశాలపై సీఎం అధ్యక్షతన మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు.

1.3 లక్షల కుటుంబాలకు దళితబంధు..

దళిత బంధుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు మంత్రి హరీష్ రావు. కేబినెట్ మీటింగ్ లో దళితబంధు అమలుపై చర్చ జరిగిందని, రెండో విడతలో 1.3 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 100 శాతం లబ్ధిదారులకు దళితబంధు ఇప్పటికే అందించామని, మిగతా 118 నియోజకవర్గాల్లో.. ఒక్కో నియోజకవర్గానికి 1,100 మందికి దళితబంధును రెండో విడతలో అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు హరీష్ రావు. 118 నియోజకవర్గాల్లోని 1,29,800 మంది లబ్ధిదారులతోపాటు.. మరో 200 మందిని చీఫ్‌ సెక్రెటరీ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేస్తుందని, మొత్తం లక్షా 30వేల కుటుంబాలకు దళితబంధు అందిస్తామన్నారు.


గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు..

రాష్ట్రంలో గొర్రెల పంపిణీకి 7.31లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని, ఇందులో 50శాతం మందికి ఇప్పటికే గొర్రె పిల్లల పంపిణీ పూర్తయిందని, మిగతా 50శాతం మందికి గొర్రెల పంపిణీకి వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు తెలిపారు మంత్రి హరీష్ రావు. దీనికోసం రూ.4,463 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ ఏప్రిల్‌ లో ప్రారంభించి, ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆ శాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

4లక్షల మంది పేదలకు ఇళ్లు..

గృహలక్ష్మి పథకం ద్వారా 4 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వబోతున్నట్టు తెలిపారు మంత్రి హరీష్ రావు. నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇళ్లు కేటాయిస్తామన్నారు. లబ్ధిదారుడికి రూ.3లక్షల గ్రాంట్‌ ఇచ్చేందుకు తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారుల ఎంపిక వెంటనే మొదలు కాబోతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు మంత్రి హరీష్ రావు.

First Published:  9 March 2023 8:27 PM IST
Next Story