ఎస్సీ వర్గీకరణ డ్రాఫ్ట్ బిల్ కు మరోసారి కేబినెట్ ఆమోదం
అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ప్రవేశ పెట్టనున్న రేవంత్ సర్కారు

ఎస్సీ వర్గీకరణ డ్రాఫ్ట్ బిల్లుకు తెలంగాణ కేబినెట్ మరోసారి ఆమోదం తెలిపింది. గురువారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన కేబినెట్ సమావేశంలో వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేశారు. ఫిబ్రవరి 4న రాష్ట్రంలోని ఎస్సీలకు మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తూ జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అదే రోజు అసెంబ్లీ, కౌన్సిల్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఆ బిల్లును గవర్నర్ కు పంపి.. గవర్నర్ ఆమోదంతో గెజిట్ విడుదల చేయాల్సిన సమయంలో వర్గీకరణపై ఎస్సీ కులాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఆయా కులాల అసంతృప్తిని చల్లార్చడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం షమీమ్ అక్తర్ కమిషన్ కాల పరిమితిని మరో నెల రోజులు పొడిగించింది. ఆయా కులాలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని మరోసారి డ్రాఫ్ట్ బిల్లు రూపొందించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. బీసీ కుల గణన, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, కొత్త రేషన్ కార్డుల జారీ, ఫోర్త్ సిటీ నిర్మాణం సహా పలు అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశముంది.