భాగ్యనగర, కాకతీయ, శాతవాహన.. ఎంపీ ఎన్నికలకు బీజేపీ కొత్త వ్యూహం
మండల, నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు ఉంటాయని చెప్పారు. అన్ని యాత్రలు హైదరాబాద్‌లో కలిసే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.
తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు 17 కచ్చితంగా గెలుస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. హైదరాబాద్‌లో MIMని మట్టికరిపిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు కిషన్‌రెడ్డి. విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1025 కి.మీ మేర 5 బస్సు యాత్రలు చేస్తామన్నారు. ఈనెల 20 నుంచి మార్చి 4 వరకు బస్సు యాత్రలు ఉంటాయన్నారు. యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో "కుమ్రం భీం".. కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్లలో "శాతవాహన".. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్‌లో "కాకతీయ".. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండలో "కృష్ణమ్మ".. భువనగిరి, మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్‌లో "భాగ్యనగర" పేరిట యాత్రలు చేస్తామన్నారు కిషన్ రెడ్డి. మండల, నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు ఉంటాయని చెప్పారు. అన్ని యాత్రలు హైదరాబాద్‌లో కలిసే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.
పదేళ్లలో ప్రధాని మోడీ సర్కారు సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు కిషన్‌రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే తాము మేడిగడ్డ బ్యారేజీని సందర్శించామన్నారు. ఇప్పుడు మళ్లీ వెళ్లాల్సిన అవససరం లేదన్నారు. కృష్ణా జలాలపై 2 రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందన్నారు కిషన్‌రెడ్డి.