Telugu Global
Telangana

గవర్నర్ కి బీజేపీ వత్తాసు.. దేనికి సంకేతం..?

తెలంగాణ గవర్నర్ కూడా కేవలం విమర్శలకే ప్రాధాన్యమిస్తున్నారనే విషయం చాలా సార్లు రుజువైంది. ఉస్మానియా ఆస్పత్రి విషయంలో కూడా భవన నిర్మాణం ఆలస్యం కావడానికి కోర్టు కేసు కారణం అయితే, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేయడం సరికాదని అన్నారు హరీష్ రావు.

గవర్నర్ కి బీజేపీ వత్తాసు.. దేనికి సంకేతం..?
X

తెలంగాణ గవర్నర్ తమిళిసై ఉస్మానియా ఆస్పత్రి విషయంలో చేసిన వ్యాఖ్యలు, వాటికి మంత్రి హరీష్ రావు ఇచ్చిన కౌంటర్లు అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో తెలంగాణ బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. గవర్నర్ ని విమర్శిస్తారా అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెరపైకొచ్చారు. నిజాయితీగా ఉండే గవర్నర్ బీఆర్ఎస్ కి నచ్చడంలేదన్నారు. గవర్నర్ పై హరీష్ రావు చేసిన విమర్శలను ఆయన ఖండించారు.

బీఆర్ఎస్ కి మాత్రమేనా..?

బీజేపీ నియమిత గవర్నర్లు, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అటు తమిళనాడులో, ఇటు పశ్చిమబెంగాల్ లో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాలను తమ నిర్ణయాలతో విసిగిస్తున్నారు, వేధిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ కూడా అదే కోవలో కేవలం విమర్శలకే ప్రాధాన్యమిస్తున్నారనే విషయం చాలా సార్లు రుజువైంది. ఉస్మానియా ఆస్పత్రి విషయంలో కూడా భవన నిర్మాణం ఆలస్యం కావడానికి కోర్టు కేసు కారణం అయితే, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేయడం సరికాదని అన్నారు హరీష్ రావు. మంచిని పక్కనపెట్టి, చెడుని భూతద్దంలో చూస్తున్నారని విమర్శించారు.

అధికార ప్రతినిధి అని ఒప్పుకున్నట్టేనా..?

తెలంగాణ గవర్నర్ పై విమర్శలు రాగానే వెంటనే బీజేపీ నేతలు ఉలిక్కి పడ్డారు. గవర్నర్ కి బీజేపీ మద్దతివ్వడాన్ని ఎవరూ తప్పుబట్టరు కానీ, ఆమె వ్యాఖ్యలను వారు సమర్థిస్తున్నారా లేదా అనేది మాత్రం తేల్చి చెప్పలేదు. అరకొర పరిజ్ఞానంతో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు, ఆ విషయంలో బీజేపీ నేతలు ఆమెకు వత్తాసు పలుకుతున్నారు. అంటే ఆమె బీజేపీ అధికార ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ఆ పార్టీ నేతలు ఒప్పుకున్నట్టేనా అని కౌంటర్లిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

First Published:  29 Jun 2023 7:43 PM IST
Next Story