Telugu Global
Telangana

బీజేపీ బాటసింగారం నిరసన భగ్నం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావుని అదుపులోకి తీసుకుని బీజేపీ ఆఫీస్ కి వారిని తరలించారు పోలీసులు. మిగతా నాయకుల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడంతో బీజేపీ నిరసన కార్యక్రమం విఫలమైంది.

బీజేపీ బాటసింగారం నిరసన భగ్నం
X

తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ చేపట్టిన నిరసనను పోలీసులు భగ్నం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుని అదుపులోకి తీసుకుని బీజేపీ ఆఫీస్ కి వారిని తరలించారు. మిగతా నాయకుల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడంతో బీజేపీ నిరసన కార్యక్రమం విఫలమైంది.

కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బాటసింగారం వద్ద నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర నిరసన చేపట్టాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. అయితే పోలీసులు ఈ నిరసనకు అనుమతివ్వలేదు.ఉదయాన్నుంచే ఎక్కడికక్కడ బీజేపీ నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఎవ‌రూ బయటకు రాలేకపోయారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. కిషన్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారికి నచ్చజెప్పినా వినలేదు, దీంతో బీజేపీ నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. పార్టీ ఆఫీస్ వద్ద వారిని వదిలిపెట్టారు.

కేంద్రమంత్రి అని కూడా చూడకుండా పోలీసులు తనతో దుర్మార్గంగా ప్రవర్తించారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పరిశీలించే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

First Published:  20 July 2023 1:51 PM IST
Next Story