Telugu Global
Telangana

బీఆర్ఎస్‌పై ఆగ‌ని బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌

కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యంలో ప్రొఫెస‌ర్‌గా ఉన్న సీతారాం నాయ‌క్ 2014లో బీఆర్ఎస్ త‌ర‌ఫున మ‌హబూబాబాద్ ఎంపీగా పోటీ చేశారు. అప్ప‌టి కేంద్ర మంత్రి, కాంగ్రెస్ అభ్య‌ర్థి పోరిక బ‌లరాం నాయ‌క్‌పై నెగ్గారు.

బీఆర్ఎస్‌పై ఆగ‌ని బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌
X

మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయి డీలాప‌డ్డ బీఆర్ఎస్‌నే టార్గెట్ చేసుకుని బీజేపీ ఆప‌రేష‌న్ ఆకర్ష్‌ను మ‌రింత విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు ఇద్ద‌రిని పార్టీలో చేర్చుకుని రెండు చోట్ల ఎంపీ టికెట్లిచ్చిన క‌మ‌ల‌ద‌ళం, ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు కీల‌క‌నేత‌ల‌పై దృష్టిపెట్టింది. మ‌హ‌బూబాబాద్‌లో మాజీ ఎంపీ సీతారాం నాయ‌క్‌, ఖ‌మ్మంలో కీల‌క నేత జల‌గం వెంగ‌ళ‌రావును బీజేపీ కీల‌క నేత‌లు క‌లిసి పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించారు.

సీతారాంనాయ‌క్‌ వ‌స్తానంటే.. వ‌ద్దంటామా?

కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యంలో ప్రొఫెస‌ర్‌గా ఉన్న సీతారాం నాయ‌క్ 2014లో బీఆర్ఎస్ త‌ర‌ఫున మ‌హబూబాబాద్ ఎంపీగా పోటీ చేశారు. అప్ప‌టి కేంద్ర మంత్రి, కాంగ్రెస్ అభ్య‌ర్థి పోరిక బ‌లరాం నాయ‌క్‌పై నెగ్గారు. 2019 ఎన్నిక‌ల నాటికి ఉమ్మ‌డి వరంగ‌ల్ జిల్లాలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రెడ్యానాయ‌క్‌, ఆయ‌న కుమార్తె మాలోత్ క‌విత కారెక్కేశారు. దీంతో సీతారాంనాయ‌క్‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌హ‌బూబాబాద్ ఎంపీ సీటును క‌విత‌కు ఇచ్చారు కేసీఆర్‌. ఈసారీ క‌విత‌కే సీటు ఖ‌రారు చేయ‌డంతో అసంతృప్తికి లోనైన సీతారాం నాయ‌క్‌ను ఈరోజు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి క‌లిసి మాట్లాడారు. పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇస్తామ‌ని ప్ర‌తిపాదించారు. సీతారాం నాయ‌క్‌లాంటి నేత వ‌స్తే కాదంటామా, బీజేపీలో చేరాలా లేదా అన్న‌ది ఆయ‌న చేతుల్లోనే ఉంద‌ని కిష‌న్‌రెడ్డి తేల్చిచెప్పేశారు.

జ‌ల‌గంపైనా దృష్టి

మాజీ ముఖ్య‌మంత్రి జ‌ల‌గం వెంగ‌ళ‌రావు త‌న‌యుడు, మాజీ ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట‌రావును బీఆర్ఎస్ ఉద్దేశ‌పూర్వ‌కంగా ప‌క్క‌న‌పెట్టేసింద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఆయ‌న్నూ పార్టీలో చేర్చుకుని ఖ‌మ్మం టికెట్ ఇవ్వాల‌ని బీజేపీ ఆలోచిస్తోంది. మాజీ సీఎం, బీజేపీ నేత న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఈ మేర‌కు జ‌ల‌గం వెంక‌ట‌రావును క‌లిసి ఈ ప్ర‌తిపాద‌న‌ను ఆయ‌న ముందుంచారు. ఆయ‌నా జంపింగ్‌కు రెడీ అన్న‌ట్లు సంకేతాలిచ్చిన‌ట్లు తెలుస్తోంది.

First Published:  8 March 2024 1:43 PM GMT
Next Story