రోడ్ షో లు, సభలతో ఫలితం లేదు.. రూటు మార్చిన తెలంగాణ బీజేపీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం క్షేత్ర స్థాయి రాజకీయంపై పార్టీ దృష్టిపెట్టకపోవడమేనని తేల్చారు బీజేపీ నేతలు.
ప్రధాని మోదీ రోడ్ షో కి వస్తే ఓట్లు పడతాయా..?
అమిత్ షా, జేపీ నడ్డాతో సభలు పెడితే సరిపోతుందా..?
అదే నిజమైతే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎందుకు బోల్తాపడింది..?
పేరుగొప్ప నాయకులంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఎందుకు ఫెయిలయ్యారు..?
తెలంగాణలో బీజేపీ స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి..? ఈ విషయంపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం క్షేత్ర స్థాయి రాజకీయంపై పార్టీ దృష్టిపెట్టకపోవడమేనని తేల్చారు బీజేపీ నేతలు. బడా నేతల మీటింగ్ లు, రోడ్ షో లు చూసుకుని మురిసిపోయారు కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని అంచనా వేయలేకపోయారు. అదే సమయంలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత ఓట్ల రూపంలో కేవలం కాంగ్రెస్ కి మాత్రమే ట్రాన్స్ ఫర్ కావడంతో బీజేపీ డీలా పడింది. ఉప ఎన్నికల్లో సత్తా చూపిన ఆ పార్టీ అసలు ఎన్నికల్లో బోల్తాపడింది.
ఇప్పుడేం చేయాలి..?
అసెంబ్లీ ఎన్నికలకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడం తెలంగాణలో బీజేపీ టార్గెట్. అందుకే ఈసారి వలస నేతలకు కూడా పెద్దపీట వేశారు, విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు ఇప్పుడు రిపీట్ కాకూడదు అనే ఉద్దేశంతో కార్యాచరణ సిద్ధం చేశారు. పార్టీనాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం మీటింగ్ లు పెడుతున్నారు. బూత్ లెవల్ లో ఉన్న వ్యవస్థలో కూడా లోపాలున్నాయని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. బూత్ కమిటీలు సరిగా పనిచేయలేదని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జరిగిన విశ్లేషణలో తేలింది. దీంతో ఈసారి ఆ తప్పు జరగకూడదని భావిస్తున్నారు బీజేపీ నేతలు. బూత్ లెవల్ కమిటీలను యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కేవలం పేపర్ పై ఉండే కమిటీలు కాకుండా.. కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో వెళ్లి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కార్యాచరణ చేపట్టారు. కాల్‌సెంటర్ ద్వారా పోలింగ్ బూత్ కమిటీల కార్యకలాపాల పర్యవేక్షణ జరుగుతోంది. ఈ మార్పులు బీజేపీకి ఏమేరకు ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.