Telugu Global
Telangana

తెలంగాణలో సీనియర్లు సైలెన్స్.. బీజేపీ భవిష్యత్తు సస్పెన్స్

మునుగోడు పరాజయం తర్వాత బీజేపీ బాగా డీలాపడిపోయింది. కిషన్ రెడ్డి అందర్నీ కలుపుకొనిపోతారనుకున్నా అది సాధ్యం కావడంలేదు. పార్టీలో జాతీయ పదవి ఇచ్చినా, రాష్ట్రంలో పట్టు కోల్పోయే సరికి బండి పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారు.

తెలంగాణలో సీనియర్లు సైలెన్స్.. బీజేపీ భవిష్యత్తు సస్పెన్స్
X

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి -సైలెంట్ మోడ్

మాజీ ఎంపీ వివేక్ - సైలెంట్ మోడ్

విజయశాంతి - వెరీ సైలెంట్ మోడ్

కొండా విశ్వేశ్వర్ రెడ్డి - పట్టీ పట్టని మోడ్

బండి సంజయ్ - అసంతృప్తి మోడ్

చెప్పుకుంటూ పోతే తెలంగాణ బీజేపీలో చాలామంది నాయకులు పార్టీ వ్యవహారాలు పట్టీ పట్టనట్టు ఉన్నారు. ఎన్నికలు దగ్గరకొస్తున్నా కూడా చాలామంది మౌనం వీడలేదు. ముఖ్యంగా బీజేపీ పగ్గాలు కిషన్ రెడ్డి చేపట్టిన తర్వాత ఈ మౌన మునుల సంఖ్య మరింత పెరిగింది.

తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డి హడావిడి తర్వాత ఈటల రాజేందర్ కాస్తో కూస్తో పార్టీ కోసం పనిచేస్తున్నట్టు కనపడుతోంది. అయితే తెలంగాణ బీజేపీలో ఆయన్ను ఓ వసల పక్షిగానే గుర్తిస్తున్నారు నేతలు. ఆయనకు అధిష్టానం పెద్ద బాధ్యత కట్టబెట్టినా, స్థానిక నాయకులు ఆ స్థాయిలో గుర్తింపునివ్వడంలేదు. ఈటల పాల్గొంటున్న కార్యక్రమాలు కూడా ఎక్కడా ప్రచారానికి నోచుకోవడంలేదు. ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా పదవి ఆశించి, ఏవేవో కామెంట్లు చేసి చివరకు సైలెంట్ అయ్యారు.

బీజేపీ అస్త్ర సన్యాసం..

బీజేపీతో పోల్చి చూస్తే కాంగ్రెస్ హడావిడి తెలంగాణలో ఎక్కువగా కనపడుతోంది. ఇటీవల హోం మంత్రి అమిత్ షా పర్యటన కూడా పేలవంగా జరిగింది. ఖమ్మంలో ‘రైతు గోస - బీజేపీ భరోసా’ అంటూ అమిత్​ షా సభ నిర్వహించారు. కానీ.. రైతులకు ఎలాంటి భరోసా, హామీ ఇవ్వకుండానే ఆ సభను ముగించారు. యాక్షన్​ ప్లాన్​ అమలు చేస్తామన్నారు కానీ ఆ ప్రకటన కూడా లేదు.

మునుగోడు పరాజయం తర్వాత బీజేపీ బాగా డీలాపడిపోయింది. ఇటు బండి సంజయ్ మార్పుతో ఓ వర్గం నుంచి సహాయ నిరాకరణ మొదలైంది. కిషన్ రెడ్డి అందర్నీ కలుపుకొనిపోతారనుకున్నా అది సాధ్యం కావడంలేదు. పార్టీలో జాతీయ పదవి ఇచ్చినా, రాష్ట్రంలో పట్టు కోల్పోయే సరికి బండి పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారు. అసలు సీనియర్లంతా మౌనంగా ఎందుకున్నారని అధిష్టానం ఆరా తీయడంలేదు. వివేక్ లాంటివారు పార్టీ మారతారంటూ వార్తలొస్తున్నాయి. ఈ దశలో ఎన్నికలకు ముందే తెలంగాణ బీజేపీ అస్త్ర సన్యాసం చేసిందని అర్థమవుతోంది.


First Published:  29 Aug 2023 5:49 PM IST
Next Story