Telugu Global
Telangana

టీడీపీకి ఒక దండం?

ఏదేమైనా తెలంగాణలోని చాలామంది బీజేపీ సీనియర్లు చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ నేలమట్టమైపోవటమే అందుకు ప్రధాన కారణం.

టీడీపీకి ఒక దండం?
X

ఢిల్లీలో అమిత్ షాను చంద్రబాబు నాయుడు ఎందుకు కలిశారు? ఏమి మాట్లాడారనే విషయంలో స్పష్టత లేదు. అయితే భేటీ ముగియగానే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ-టీడీపీ పొత్తు విషయంపైనే చర్చలు జరిగాయనే ప్రచారం మాత్రం బాగా జరుగుతోంది. దాంతో వెంటనే తెలంగాణలోని కమలనాథులు వేగంగా స్పందించారు. పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీతో బీజేపీ పొత్తుండదని తేల్చేశారు. తమకు తెలుగుదేశం పార్టీలో పొత్తు అవసరమే లేదన్నారు.

ఎప్పుడో తెలంగాణలో ఎత్తిపోయిన టీడీపీతో తాము పొత్తు పెట్టుకోవటం ఏమిటని ఎదురు ప్రశ్నించారు. అసలు ఇక్కడ టీడీపీకి ఉన్న ఓట్లెన్న? ఆ పార్టీ తమకు ఏ రకంగా సహకారం అందిచగలదని అడిగారు. టీడీపీతో పొత్తూవద్దు వాళ్ళ ఓట్లూ వద్దంటు తెగేసి చెప్పారు. ఇక మరో సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీతో బీజేపీకి పొత్తుండదన్నారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తేనే బాగుంటుందని తమ నేతలంతా అనుకుంటున్నట్లు చెప్పారు.

కారణం స్పష్టంగా తెలియ‌దుకానీ ఢిల్లీకి రమ్మని పిలుపురాగానే పార్టీ చీఫ్ బండి సంజయ్ ఆదివారం రాత్రి బయలుదేరి వెళ్ళారు. శనివారం రాత్రి అమిత్-చంద్రబాబు భేటీ అవటం, బండిని ఢిల్లీకి రమ్మని ఆదేశాలు రావటంతో బహుశా పొత్తుల విషయంలో బండి అభిప్రాయం తెలుసుకునేందుకే రమ్మన్నారని నేతలు అనుకుంటున్నారు. ఏదేమైనా తెలంగాణలోని చాలామంది సీనియర్లు చంద్రబాబు నాయుడుతో చేతులు కలపటాన్ని ఏమాత్రం ఇష్టపడటంలేదు. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ నేలమట్టమైపోవటమే ప్రధాన కారణం.

ఇక మరో కారణం ఏమిటంటే 2018 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఏమైందో చూశారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్ సీనియర్లు చంద్రబాబుపై మండిపోయారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నందు వల్లే కాంగ్రెస్ చాలా చోట్ల ఓడిపోయిందని బాహాటంగానే విమర్శలు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకోకపోయుంటే మంచి ఫలితాలు వచ్చుండేవని చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. అవన్నీ చూసిన తర్వాత కమలనాథులకు పాత జ్ఞాపకాలు, అనుభవాలు గుర్తుకొచ్చినట్లున్నాయి. అందుకనే టీడీపీతో పొత్తు అంటే దండం పెట్టేస్తున్నారు. మరి ఢిల్లీలో పెద్దలు ఏమంటారు? ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

First Published:  6 Jun 2023 11:07 AM IST
Next Story