Telugu Global
Telangana

ఊ కొడ‌తారు.. ఉలిక్కిప‌డ‌తారు.. చేరిక‌ల‌పై చివ‌రి నిమిషంలో హ్యాండిస్తున్న‌ బీజేపీ నేత‌లు

తెలంగాణ‌లో బీఆర్ఎస్ టికెట్లు ద‌క్క‌నివారు, అసంతృప్తులు, బ‌య‌టి నుంచి వ‌చ్చేవాళ్లు ఎవ‌రైనా ఉన్నా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేర‌డానికే మొగ్గు చూపిస్తున్నారు.

ఊ కొడ‌తారు.. ఉలిక్కిప‌డ‌తారు.. చేరిక‌ల‌పై చివ‌రి నిమిషంలో హ్యాండిస్తున్న‌ బీజేపీ నేత‌లు
X

తెలంగాణ‌లో బీజేపీ గ్రాఫ్ ఏడాది కింద‌ట చాలా సూప‌ర్‌గా ఉంది. బీఆర్ఎస్‌కు పోటీ బీజేపీ అనే స్థాయిలో హంగామా న‌డిచింది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి వేరు. 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో నిల‌బెట్ట‌డానికి స‌రైన అభ్య‌ర్థులు దొర‌క‌ని ప‌రిస్థితిలో బీజేపీ ఉంది. అలాగ‌ని ఎవ‌ర‌న్నా కాస్త పేరు, ప‌లుకుబ‌డి ఉన్న‌వారు చేర‌తామ‌ని ముందుకొస్తే ఊ అంటున్న అగ్ర‌నేత‌లు.. తీరా వాళ్లొచ్చేస‌రికి ముఖం చాటేస్తున్నారు. ముందు ఊ అన‌డం.. త‌ర్వాత ఉలిక్కిప‌డ‌టం ఎందుక‌ని క‌మ‌లం పార్టీ శ్రేణులు గొణుక్కుంటున్నారు.

మొన్న కృష్ణ యాద‌వ్‌.. నిన్న చీకోటి

మొన్న‌టికి మొన్నమాజీ మంత్రి కృష్ణా యాద‌వ్ పార్టీలో చేర‌తామంటే ఓఎస్ అన్నారు క‌మ‌ల‌నాథులు.. ఆయ‌న మందీమార్బ‌లాన్ని వెంటేసుకుని పార్టీ ఆఫీసు ద‌గ్గ‌ర‌లోనే ఓ క‌ల్యాణ మండ‌పానికి చేరుకున్నారు. క‌మ‌లం పెద్ద‌లు ఊ అనగానే అక్క‌డి నుంచి ఊరేగింపుగా వెళ్లి బీజేపీలో చేరిపోవాల‌నుకున్నారు. కానీ, పెద్ద నేత‌లు ఏ ఫోనుకూ స్పందించ‌లేదు. చూసి చూసి కృష్ణా యాద‌వ్ వెనుదిరిగారు. మ‌రోవైపు ఇటీవ‌ల కాలంలో బాగా వార్త‌ల్లో నిలుస్తున్న చీకోటి ప్ర‌వీణ్‌కుమార్ బీజేపీలో చేర‌తాన‌ని చెబితే ఊ కొట్టారు. మంగ‌ళ‌వారం చేరిక‌కు ముహూర్తం కూడా పెట్టారు. కానీ, ఆయ‌న వ‌స్తాన‌ని బ‌యల్దేరితే ముఖం చాటేశారు.

వ‌చ్చేవాళ్లే త‌క్కువ‌.. మ‌ళ్లీ మనం అడ్డుక‌ట్ట వేస్తే ఎలా?

తెలంగాణ‌లో బీఆర్ఎస్ టికెట్లు ద‌క్క‌నివారు, అసంతృప్తులు, బ‌య‌టి నుంచి వ‌చ్చేవాళ్లు ఎవ‌రైనా ఉన్నా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేర‌డానికే మొగ్గు చూపిస్తున్నారు. బీజేపీలోకి వ‌చ్చే ఒక‌ళ్లిద్ద‌ర్నీ కూడా ఇలా ట్రీట్ చేస్తే ఇంక కొత్త‌వాళ్లు ఎవ‌రొస్తార‌ని ఆ పార్టీ శ్రేణులు నారాజ్ అవుతున్నాయి. కృష్ణాయాద‌వ్ కావ‌చ్చు, చీకోటి కావ‌చ్చు.. వాళ్ల చేరిక‌తో డ్యామేజ్ అవుతామ‌నుకుంటే వ‌స్తామ‌ని వాళ్లు అడిగిన‌ప్పుడే సున్నితంగా తిర‌స్కరించొచ్చు క‌దా.. రోడ్డెక్కాక ముఖం దాచుకోవ‌డం దేనిక‌ని బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్రశ్నిస్తున్నారు.

First Published:  13 Sept 2023 10:29 AM IST
Next Story