Telugu Global
Telangana

ఢిల్లీకి టీ.బీజేపీ నేతల క్యూ.. పదవుల కోసం లాబీయింగ్

ఈసారి పార్టీ స్టేట్‌ చీఫ్ పదవి ఎంపీగా ఉన్న బీసీ నేతకు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ రేసులో మాజీ స్టేట్ చీఫ్‌, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.లక్ష్మణ్‌ కూడా ఉన్నారని తెలుస్తోంది.

ఢిల్లీకి టీ.బీజేపీ నేతల క్యూ.. పదవుల కోసం లాబీయింగ్
X

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో.. పలువురు తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికే పదవుల కోసం ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వీరిలో మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్, మెదక్ అభ్యర్థి ఎన్.రఘునందన్ రావు, పార్టీ వైస్ ప్రెసిడెంట్ NVSS ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు పదవుల కోసం ఇప్పటికే ఢిల్లీలో పార్టీ అగ్రనేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం.

ఈ నలుగురిలో ఇద్దరు నేతలు తమను కేంద్రమంత్రిగా లేదా పార్టీ స్టేట్ చీఫ్‌గా నియమిస్తారని ఆశతో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డిని ఏడాది క్రితమే పార్టీ స్టేట్‌ చీఫ్‌గా నియమించారు. ఇక ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జూన్‌లో ముగియనుండడంతో రాష్ట్రంలోనూ మార్పులుంటాయని పలువురు నేతలు భావిస్తున్నారు. మరోవైపు ఈసారి పార్టీ స్టేట్‌ చీఫ్ పదవి ఎంపీగా ఉన్న బీసీ నేతకు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ రేసులో మాజీ స్టేట్ చీఫ్‌, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.లక్ష్మణ్‌ కూడా ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే సీట్ల సంఖ్యను బట్టి మార్పులు, చేర్పులుంటాయని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే కిషన్ రెడ్డికి మరోసారి కేంద్రమంత్రి ఖాయమని.. దీంతో పార్టీ చీఫ్‌గా తమకు అవకాశం ఇస్తారని ఈ నేతలు ఆశలు పెట్టుకున్నారు.

సాధారణంగా 10 లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రానికి కేంద్ర కేబినెట్‌లో రెండు బెర్తులు లభిస్తాయి. కానీ ప్రస్తుతం దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఈ నిబంధనను ఈసారి పక్కకు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ తెలంగాణలో దాదాపు 8కి పైగా సీట్లు గెలిస్తే 3-4 కేంద్రమంత్రి పదవులు లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

First Published:  4 Jun 2024 3:56 AM GMT
Next Story