దశాబ్ది ఉత్సవాలు.. బీజేపీ అడ్రస్ గల్లంతు
తల్లిని చంపి బిడ్డను బతికించారన్న విద్వేష వ్యాఖ్యలు స్వయానా ప్రధాని మోదీ చేసినవే. తెలంగాణపై విషం చిమ్మిన బీజేపీ, రాష్ట్ర విభజన క్రెడిట్ లో భాగం తీసుకోలేక అవతరణ ఉత్సవాలకు దూరమైపోయింది.
తెలంగాణ అవతరణ జరిగి పదేళ్లవుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి అధికారికంగా దశాబ్ది ఉత్సవాలు మొదలవుతున్నాయి. జూన్ 22 వరకు 21రోజులపాటు భారీ ఎత్తున ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అమరుల త్యాగాలు స్మరించుకుంటూ తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ విజయాలను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహించబోతున్నారు.
దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ కూడా ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. తెలంగాణ ఇచ్చింది మేమే అనే నినాదంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు హస్తం పార్టీ నేతలు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగింది కాబట్టి ఆ విషయాన్ని హైలెట్ చేస్తూ తెలంగాణ ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తోంది కాంగ్రెస్.
బీజేపీ అడ్రస్ గల్లంతు..
తెలంగాణకోసం జరిగిన పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యం. కేసీఆర్ పోరాటం వల్ల తెలంగాణ సాకారమైంది. తెలంగాణ ఇచ్చింది మేమేనంటూ చెప్పుకుంటుంది కాంగ్రెస్. కానీ బీజేపీకి చెప్పుకోడానికి ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో కిషన్ రెడ్డి లాంటి నేతలు కనీసం రాజీనామాలు కూడా చేయలేదని మంత్రి కేటీఆర్ విసిరే చెణుకులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అందుకే ఈ దశాబ్ది ఉత్సవాలకు బీజేపీ దూరంగా ఉంటోంది, ఉండాల్సి వస్తోంది.
తెలంగాణ ఇచ్చింది మేమేనంటుంది కాంగ్రెస్, తెలంగాణ తెచ్చింది మేనేనంటూ గర్వంగా చెప్పుకుంటుంది బీఆర్ఎస్. 9 ఏళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూడమంటోంది. మధ్యలో బీజేపీ ఇరుకునపడింది. ఎన్నికల ఏడాదిలో దశాబ్ది ఉత్సవాలు బీజేపీని బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు. పైగా తల్లిని చంపి బిడ్డను బతికించారన్న విద్వేష వ్యాఖ్యలు స్వయానా ప్రధాని మోదీ చేసినవే. తెలంగాణపై విషం చిమ్మిన బీజేపీ, రాష్ట్ర విభజన క్రెడిట్ లో భాగం తీసుకోలేక అవతరణ ఉత్సవాలకు దూరమైపోయింది.