కమలం కొంప ముంచుతున్న గ్లాస్
మునుగోడులో జనసేన పోటీలో లేదు కాబట్టి వారంతా కమలం పువ్వుకే ఓటు వేయాలి. కానీ పవన్ అభిమానులు గ్లాసు కనపడగానే ఎమోషన్ తో ఆ గుర్తువైపే బటన్ నొక్కుతారేమోననే భయం బీజేపీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డికి ఉంది.
తెలంగాణలో జనసేన పొత్తు బీజేపీకి ఏమాత్రం ఉపయోగపడకపోగా నష్టం చేకూర్చేలా ఉంది. 32 సీట్లు అడిగిన జనసేనకు 8 సీట్లు ఇచ్చి సర్దిచెప్పింది బీజేపీ. అయితే ఆ ఎనిమిది సీట్లు ఇవ్వడం కూడా ఇప్పుడు బీజేపీకి తలనొప్పిగా మారింది. జనసేన పోటీ లేని చోట్ల స్వతంత్రులకు లభించిన గాజు గ్లాసు గుర్తు కమలానికి పోటీగా తయారైంది. ఆ గ్లాసు, ఈ గ్లాసు ఒకటేనని జనసైనికులు పొరపాటు పడితే మాత్రం కమలం కష్టాలు కొని తెచ్చుకున్నట్టే లెక్క.
తెలంగాణలో బీజేపీకి పవన్ కల్యాణ్ బేషరతు మద్దతు ఇచ్చి సరిపెట్టి ఉంటే ఆ లెక్క వేరు. కానీ ఇక్కడ పవన్ పార్టీ తరపున 8 మంది బరిలో ఉన్నారు. వారందరికీ ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. అయితే జనసేన పోటీలో లేని మిగతా చోట్ల కొంతమంది స్వతంత్రులకు గ్లాసు గుర్తు ఇచ్చింది. అంటే ఆ 8 నియోజకవర్గాల్లోనే కాదు, మిగతా చోట్ల కూడా గాజు గ్లాసు ఈవీఎంలలో కనపడుతుంది. అంటే అక్కడ కమలానికి ఓటు వేయాలా, గ్లాసు గుర్తుపై బటన్ నొక్కాలా అనే కన్ఫ్యూజన్ జనంలో ఉంటుందనమాట. అదే ఇప్పుడు బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది.
కోదాడలో జనసేన అభ్యర్థి మేకల సతీష్ రెడ్డి గాజు గ్లాసు గుర్తుతో పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ పోటీలో లేదు. సో.. బీజేపీ అభిమానులకు, పవన్ కల్యాణ్ మద్దతుదారులకు.. గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేయాలనే క్లారిటీ ఉంది. అయితే మునుగోడులో బీజేపీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి కమలం పువ్వు గుర్తుతో పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి అంతటి హరిప్రసాద్ గౌడ్ కు గాజు గ్లాసు సింబల్ కేటాయించింది ఈసీ. అంటే ఇక్కడ పవన్ అభిమానులు ఏ గుర్తుకి ఓటు వేయాలి.
మునుగోడులో జనసేన పోటీలో లేదు కాబట్టి వారంతా కమలం పువ్వుకే ఓటు వేయాలి. కానీ పవన్ అభిమానులు గ్లాసు కనపడగానే ఎమోషన్ తో ఆ గుర్తువైపే బటన్ నొక్కుతారేమోననే భయం బీజేపీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డికి ఉంది. అందుకే మునుగోడులో బీజేపీ అభ్యర్థి ప్రత్యేకంగా కమలం పువ్వు చేతిలో పట్టుకుని జనసేన కండువా కప్పుకుని ప్రచారం చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిలాగా తన గుర్తుని ప్రజలకు చూపిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఈవీఎంలో కనపడే గ్లాసు గుర్తుని పట్టించుకోవద్దని కోరుతున్నారు. మొత్తానికి జనసేనతో బీజేపీకి ఉపయోగం ఎంతుందో చెప్పలేం కానీ, గ్లాసు గుర్తు కమలాన్ని కష్టాల్లోకి నెట్టే అవకాశం మాత్రం ఉందనే చెప్పాలి.
♦