నేటినుంచి తెలంగాణ బీజేపీ దరఖాస్తుల స్వీకరణ..
తెలంగాణలో ఆశావహులనుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు బీజేపీ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. ఫీజు లేదు కానీ అప్లికేషన్ విషయంలో చాలా నియమ నిబంధనలు ఉన్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ జాబితా ప్రకటించేసి ప్రచారం మొదలు పెట్టింది, కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించి వడపోయడానికి కుస్తీలు పడుతోంది, ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగింది. అసెంబ్లీ టికెట్ ఆశించేవారినుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈరోజు నుంచి మొదలయ్యే దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 10తో ఆఖరు. ఆ తర్వాత స్క్రూటినీ, అభ్యర్థుల ప్రకటన ఉంటుంది.
ఫీజు లేదు..
కాంగ్రెస్ పార్టీ ఆశావహులనుంచి ఫీజు వసూలు చేసింది. కానీ బీజేపీ మాత్రం ఉచితంగానే దరఖాస్తులు తీసుకుంటోంది. ఉచితం అని ప్రకటించినా కూడా కొన్ని నియోజకవర్గాల్లో సింగిల్ అప్లికేషన్ కూడా రాదనే అంచనాలున్నాయి. కనీసం ప్రతిష్టకోసమయినా దరఖాస్తుల విషయంలో బీజేపీ ఉదారంగా ఉండే అవకాశం మాత్రం కనపడుతోంది. కాంగ్రెస్ లో 119 నియోజకవర్గాలకు 1010 దరఖాస్తులు రాగా, బీజేపీ అంతకంటే ఎక్కువ నెంబర్ చూపించుకోడానికి తహతహలాడుతోంది. ఆ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.
ప్రత్యేక సెల్..
తెలంగాణలో ఆశావహులనుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఫీజు లేదు కానీ అప్లికేషన్ విషయంలో చాలా నియమ నిబంధనలు ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అప్లికేషన్ నింపాలంటే కనీసం రెండు రోజులు సమయం పడుతుందని అంటున్నారు. అన్ని వివరాలు పక్కాగా దరఖాస్తులో సమర్పించాల్సి ఉంటుంది. గతంలో చేసిన ప్రజా పోరాటాల పేపర్ క్లిప్పింగ్ లు కూడా అందులో జతచేయాల్సి ఉంటుంది. అంటే తొలిదశలోనే వడపోత ఈజీగా జరిగిపోతుంది. ఆ తర్వాత పెద్ద నాయకులకు ఎలాగూ అధిష్టానం అండదండలుంటాయి. రాగా పోగా ఈ అప్లికేషన్ ప్రక్రియ, లాబీయింగ్ అనేది ఆశావహుల కంటితుడుపు చర్యగానే కనపడుతోంది.