Telugu Global
Telangana

తెలంగాణలో బీజేపీ ఎన్నికల కమిటీలు.. అసంతృప్తులకు కీలక పదవులు

ఇటీవల పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏకంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు.

తెలంగాణలో బీజేపీ ఎన్నికల కమిటీలు.. అసంతృప్తులకు కీలక పదవులు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ సిద్ధమవుతున్న వేళ.. బీజేపీ ఎన్నికల కమిటీలను ప్రకటించింది. నేతలందరినీ కమిటీల్లో సర్దుబాటు చేసింది. దాదాపుగా అందరికీ తలా ఓ పదవి వచ్చేలా ఈ కమిటీలను సిద్ధం చేశారు. ఒకరకంగా అసంతృప్తులను కూల్ చేసేందుకు ఈ కమిటీల్లో వారికి కీలక పదవులిచ్చారు.

ఇటీవల పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏకంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అభ్యర్థుల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీది కీలక పాత్ర. ఈ కమిటీకి రాజగోపాల్ రెడ్డిని చైర్మన్ గా చేశారంటే.. ఆయనను ఓ రేంజ్ లో బుజ్జగించి సంతోషపెట్టాలనుకున్నారని అర్థమవుతోంది.

విజయశాంతికి అజిటేషన్ కమిటీ..

నిరసనలు, ఆందోళన నిర్వహణ బాధ్యతలకు సంబంధించి అజిటేషన్ కమిటీకి చైర్మన్ గా విజయశాంతిని నియమించారు. పబ్లిక్‌ మీటింగ్‌ కమిటీ ఇన్ ఛార్జ్‌ గా బండి సంజయ్‌.. మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్ గా గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ఛార్జ్‌ షీట్‌ కమిటీ చైర్మన్‌ గా మురళీధర్‌ రావుని నియమించింది అధిష్టానం.

ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిలో ఉన్న డీకే అరుణను నియమించారు. ఎన్నికల కమిటీ చైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అర్వింద్‌ లకు అధిష్టానం బాధ్యతలు కేటాయించింది. మొత్తం 14కమిటీలను ఈరోజు బీజేపీ ప్రకటించింది.

తెలంగాణను ఆరు జోన్లుగా విభజించి, ఎన్నికల వ్యూహాలు అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. సునీల్‌ బన్సల్‌ అధ్యక్షతన ఈరోజు, రేపు సంస్థాగత కార్యక్రమాలు జరగబోతున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్ ఛార్జిలు, రాష్ట్ర పదాధికారులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలకు తెలంగాణ బీజేపీ కసరత్తులు చేస్తోంది.

First Published:  5 Oct 2023 12:21 PM IST
Next Story