Telugu Global
Telangana

బీజేపీ బీసీ మంత్రం.. టికెట్లలోనూ వారికే పెద్దపీట

సామాజికవర్గాల పరంగా బీసీలకు పెద్దపీట వేసింది బీజేపీ. ఇప్పటివరకూ చూసుకుంటే మిగిలిన రెండు ప్రధాన పార్టీల కంటే బీజేపీ బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించింది.

బీజేపీ బీసీ మంత్రం.. టికెట్లలోనూ వారికే పెద్దపీట
X

తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ.. టికెట్ల విషయంలోనూ వారికి పెద్దపీట వేసింది. మొదటి విడతలో 52, రెండో విడతల్లో ఒక్క స్థానానికి అభ్యర్థులను ప్రకటించిన కమలనాథులు.. గురువారం మరో 35 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. దీంతో మొత్తంగా 88 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

ఇక సామాజికవర్గాల పరంగా బీసీలకు పెద్దపీట వేసింది బీజేపీ. ఇప్పటివరకూ చూసుకుంటే మిగిలిన రెండు ప్రధాన పార్టీల కంటే బీజేపీ బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించింది. 88 స్థానాల్లో దాదాపు 32 మంది బీసీ అభ్యర్థులకు చోటిచ్చింది. ఇక 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ ఇప్పటివరకూ 20 మంది బీసీలకు మాత్రమే చోటివ్వగా.. అధికార బీఆర్ఎస్ పార్టీ 23 మంది బీసీలకు అవకాశం ఇచ్చింది.

తెలంగాణలో బీసీలు 50 శాతం కంటే అధికంగా ఉండటంతో అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ బీసీని సీఎం చేస్తామంటూ హామీ ఇచ్చింది.

ఇక బీజేపీ ప్రకటించిన మొత్తం 88 అభ్యర్థుల్లో 13 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ, 24 మంది రెడ్డిలతో పాటు.. బ్రాహ్మణ, కమ్మ, వెలమ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్‌ ఇచ్చింది. మరో 31 స్థానాలు బీజేపీ ప్రకటించాల్సి ఉండటంతో ఆ పార్టీ తరపున బరిలోకి దిగే బీసీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

First Published:  3 Nov 2023 7:40 AM IST
Next Story