Telugu Global
Telangana

తెలంగాణ భవన్‌ ఇప్పుడు జనతా గ్యారేజ్‌ అయ్యింది

ప్రజలకు ఏ కష్టం వచ్చినా భవన్‌ గుర్తుకు వస్తున్నది : కేటీఆర్‌

తెలంగాణ భవన్‌ ఇప్పుడు జనతా గ్యారేజ్‌ అయ్యింది
X

తెలంగాణ భవన్‌ ఇప్పుడు జనతా గ్యారేజ్‌ అయ్యిందని.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా భవన్‌ గుర్తుకు వస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం రాత్రి తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన దీక్షా దివస్‌లో ఆయన మాట్లాడారు. మూసీ, హైడ్రా, లగచర్ల బాధితులు సాయం కోసం తెలంగాణ భవన్ కు వస్తున్నారని, ప్రజలకు ఎప్పుడూ ఏ కష్టమొచ్చినా తెలంగాణ భవన్ తలుపులు తీసే ఉంటాయన్నారు. ప్రజల కష్టాలపై అసెంబ్లీ, కౌన్సిల్‌ సహా అన్ని వేదికలపై పోరాడుతామన్నారు. తెలంగాణ గొంతు అంటే బీఆర్ఎస్ మాత్రమేనని, మరెవరూ కాదన్నారు. ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం చేసి మైనార్టీల ఓట్లతో రాజకీయ లబ్ధిపొందారని అన్నారు. మైనార్టీలు కూడా తమ వాళ్లు ఎవరో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర సంచులు మోసి ద్రోహి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడని.. ఆయన కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేసే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. తెలంగాణ ఉద్యమంపై గన్ను ఎక్కుపెట్టిన రేవంత్‌ ఇప్పుడు అస్తిత్వాన్ని చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. లగచర్లలో భూముల సేకరణ విరమణ బీఆర్‌ఎస్‌ విజయమన్నారు. 15 ఏళ్ల క్రితం కేసీఆర్‌ ఉక్కు సంకల్పంతో ‘తెలంగాణ వచ్చుడో...కేసీఆర్ సచ్చుడో’ అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారని తెలిపారు. తెలంగాణ భవన్ వద్ద లైట్లు బంద్ జేసి, కరెంట్ తీసేసి ఈ ప్రభుత్వం తక్కువ బుద్దితో వ్యవహరించిందని మండిపడ్డారు.

మనం గతం తెలుసుకోకుండా.. గమ్యాన్ని నిర్ణయించుకోలేమని అందుకే ఆనాటి కేసీఆర్పో రాటం, అమర వీరుల త్యాగాలు, ఉద్యోగ సంఘాల పోరాటాల చరిత్ర కొత్త తరానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి జాతి తన ఘనమైన గత వైభవాన్ని, పోరాటాలను, త్యాగాలను, విజయాలను కథగానో.. పాటగానో.. ఏదో కళారూపంలో నిత్యం గానం చేస్తూనే తర్వాతి తరాలకు అందిస్తుండాలన్నారు. ఏ జాతి తన చరిత్రను విస్మరిస్తుందో ఆ జాతి పరాయి పెత్తనంలో బానిసగా మగ్గిపోతుందన్నారు. అందుకే తెలంగాణ ఉద్యమ చరిత్రను నేటి తరానికి గుర్తు చేస్తున్నమన్నారు. తెలంగాణ భావజాలం మీద ఎన్నెన్ని దాడులు జరిగాయో అందరికీ తెలియాలన్నారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడి నాయకత్వానికి పాలించే సత్తా లేదని మనపై దాడి చేశారని, వాటిని పటాపంచలు చేస్తూ దేశం గర్వించేలా కేసీఆర్‌ పాలన చేశారన్నారు. తెలంగాణ కథలో కథానాయకుడు కేసీఆర్‌ అన్నారు. మన చరిత్రను రేపటి తరానికి నరనరాన ఎక్కించాలన్నారు. ఒకసారి ఆదమరిచి.. అప్రమత్తత లేకుండా పొరపాటు చేస్తే సమైక్యాంధ్రలో 60 ఏళ్లు అరిగోస పడ్డామని గుర్తు చేశారు. స్వాతంత్య్రం సాధించడం ఎంత ముఖ్యమో నిలబెట్టుకోవడమూ అంతే ముఖ్యమన్నారు. ఒక తరానికి ఆత్మగౌరవ రణం నేర్పి కేసీఆర్ విముక్తి ఎట్లా సాధించాడో రేపటి తరానికి తెలపాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు.

ఈ పోరాటంలో హీరోలు ఎవరో.. విలన్లు ఎవరో.. శిఖండులు ఎవరో.. ఎవరి పాత్ర ఏందో తెలిస్తేనే ఈ జనరేషన్ జాగ్రత్త నేర్చుకుంటుందన్నారు. శత్రువు ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉంటారని, ప్రత్యర్థులు దాడులు చేస్తూనే ఉంటారన్నారు. తెలంగాణ ఏర్పాటుతో నష్ట పోయిన శక్తులు మళ్లీ ఏదో రూపంలో పెత్తనం కోసం ఆరాట పడుతూనే ఉంటాయన్నారు. ఇవన్ని జాగ్రత్తగా గమనించాలని సూచించారు. ఢిల్లీ, గుజరాత్‌ గులాములతో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. రేవంత్‌ రెడ్డి చెరిపేయాలని చూస్తున్నది కేసీఆర్ ఆనవాళ్లను కాదు తెలంగాణ ఆనవాళ్లను అని హెచ్చరించారు. అందుకే రాష్ట్ర రాజముద్రలో కాకతీయ శిళాతోరణం, చార్మినార్‌లను తొలిగించాలని దుర్మార్గమైన ఆలోచన చేశాడని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేస్తానంటున్నాడు.. సెక్రటేరియట్‌ ఎదుట తెలంగాణ తల్లి స్థానాన్ని కబ్జా పెట్టి రాహుల్‌ గాంధీ తండ్రి విగ్రహం పెట్టి సిగ్గు లేకుండా ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నడని అన్నారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఇక్కడ అదానీలు, ప్రధానిలు ఇక్కడ అడుగు పెట్టే సాహసం చేయలేదని, ఇప్పుడు మళ్లీ తెలంగాణపై పట్టుకోసం వస్తున్నారని తెలిపారు. తెలంగాణపై జరుగుతోన్న దాడిని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. బ్రిటీషర్ల కన్నా అరాచకంగా లగచర్లలో గిరిజనులపై అఘాయిత్యాలకు ఒడిగట్టారని, బీఆర్‌ఎస్‌ ఆందోళనలతో ఇప్పుడు వెనక్కి తగ్గారని అన్నారు. ఈ రియల్ ఎస్టేట్ బేహారీకి పాలన అంటే తెలియదని, మీ భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ దందా చేయడం మాత్రమే తెలుసన్నారు. మరో రూపంలో భూములు గుంజుకోవాలని వస్తారని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రతిఘటన మాత్రమే మనకున్న అవకాశమని తెలిపారు. సమావేశంలో మధుసూదనాచారి, శ్రీనివాస్‌ యాదవ్‌, పద్మారావు గౌడ్‌, కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొన్నారు.

First Published:  29 Nov 2024 8:11 PM IST
Next Story