సరకు నిల్వలో తెలంగాణ భళా.. జోరందుకున్న గోడౌన్ల ఏర్పాటు..
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ గోడౌన్ల ద్వారా 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పరిశ్రమల శాఖ గోడౌన్ల నిర్మాణానికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా తర్వాత ప్రజల అభిరుచుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. గృహోపకరణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఒకరకంగా నిత్యావసరాలకంటే గృహోపకరణాల మార్కెట్ ఇప్పుడు రెండింతలైంది. ఈ దశలో గోడౌన్ల ఏర్పాట్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుత డిమాండ్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో గోడౌన్ల నిర్మాణం జోరందుకుంది. రిటైల్ మార్కెటింగ్ విస్తరించేందుకు, ఉపాధి మార్గాలు పెంచేందుకు, పారిశ్రామిక, వాణిజ్య సంస్థల ద్వారా గృహోపకరణాల గోడౌన్ల నిర్మాణాలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరళీకృత అనుమతులతో పాటు సేవారంగం కింద రాయితీలు ఇస్తోంది. ఇప్పటికే 20కిపైగా సంస్థలు భారీ గోడౌన్లు నిర్మించాయి. మరో 35 సంస్థలు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
తెలంగాణలో ఇప్పటికే 50కిపైగా ఈ-కామర్స్ సంస్థలు తమ వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఆహారం, కిరాణం, దుస్తులు, పాదరక్షలు, ఫర్నిచర్.. ఇతర సామగ్రిని విక్రయిస్తున్నాయి. వీటన్నిటికీ ఆఫీస్ లతో పాటు గోడౌన్లు కూడా ముఖ్యం. దేశవ్యాప్తంగా కేవలం ఐదారు ప్రాంతాల్లోనే భారీ గోడౌన్లు ఈ సంస్థలకు ఉండేవి. ఇప్పుడు బిజినెస్ పెరుగుతున్న దృష్ట్యా ప్రతి రాష్ట్రంలో గోడౌన్ల ఏర్పాటు అనివార్యంగా మారింది. అందులోనూ తెలంగాణ వంటి బిజినెస్ సెంటర్లో గోడౌన్లు ఆయా సంస్థలకు తప్పనిసరి అయ్యాయి. అందుకే స్థానికంగా గోడౌన్ల నిర్మాణాలపై ఆయా సంస్థలు దృష్టిసారించాయి.
హైదరాబాద్ నగర శివారు కొత్తూరులో ప్రసిద్ధ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గోడౌన్ నిర్మించింది. రంగారెడ్డి జిల్లాలో ఐకియా, వాల్‌మార్ట్, లులు, ఫ్లిప్ కార్ట్, జూబిలెంట్ ఫుడ్స్, ఏషియన్ పెయింట్స్ తదితర సంస్థలు భారీ గోడౌన్లు నిర్మించాయి. మేడ్చల్ జిల్లాలో హిమాలయ హెర్బల్ హెల్త్‌కేర్ 36 వేల చదరపు అడుగుల్లో, బిర్లా టైర్స్ 50,000 చదరపు అడుగుల్లో గోడౌన్లు నిర్మిస్తున్నాయి. ఉప్పల్, నాచారం, చర్లపల్లి, ఆటోనగర్, బండ్లగూడ, చందానగర్ లో కూడా పెద్ద పెద్ద గోడౌన్ల నిర్మాణం జోరందుకుంది. కొన్ని సంస్థలు లీజుపై స్థలాలను తీసుకొని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాయి.
ఉపాధి అవకాశాలు మెండు..
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ గోడౌన్ల ద్వారా 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వివిధ సంస్థల నుంచి వచ్చిన విన్నపాలను దృష్టిలో పెట్టుకొని పరిశ్రమల శాఖ గోడౌన్ల నిర్మాణానికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తోంది. రిటైల్ బిజినెస్ లో గృహోపకరణాల గోడౌన్ల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతి ద్వారా అనుమతులిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించింది. గోడౌన్లను పంపిణీ కేంద్రాలుగా గుర్తించి సేవారంగం కింద రుసుములను కూడా మినహాయించింది. మొత్తమ్మీద ఇప్పుడు తెలంగాణలో గోడౌన్ల నిర్మాణం జోరందుకుంది. సరకు నిల్వ విషయంలో ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణకే ఆయా కంపెనీలు ప్రయారిటీ ఇస్తున్నాయి.