Telugu Global
Telangana

"తెలంగాణ ఆటో డ్రైవర్".. యూట్యూబర్లకు సేలబుల్ సబ్జెక్ట్

ఆటో డ్రైవర్లకి కూడా కుటుంబాలుంటాయి. ఆ కుటుంబాల్లో మహిళలుంటారు, ఆ మహిళలు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తుంటారు. అంటే ఆటో డ్రైవర్ల కుటుంబాలు కూడా ప్రభుత్వ ఉచిత రవాణా వల్ల లాభపడుతున్నాయనే చెప్పుకోవాలి.

తెలంగాణ ఆటో డ్రైవర్.. యూట్యూబర్లకు సేలబుల్ సబ్జెక్ట్
X

తెలంగాణలో ఇప్పుడు 'ఆటో డ్రైవర్' హాట్ టాపిక్ గా మారారు. టీవీలు, సోషల్ మీడియా న్యూస్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లకు ఆయన ముఖ్య అతిథి అయ్యారు.

అన్నా మీకు ఉపాధి ఎట్లా..?

అన్నా మహిళలంతా ఆర్టీసీ బస్సులెక్కుతుంటే మీ ఆదాయం పడిపోయిందా..?

అన్నా, కాంగ్రెస్ కి ఓటు వేసినందుకు మీరు బాధపడుతున్నారా..?

ఈ ప్రశ్నలతో ఆటో డ్రైవర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొంతమంది ఆటో డ్రైవర్ల సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ తెలంగాణ ఆటో డ్రైవర్లు మరీ అంత దారుణ స్థితిలోకి వెళ్లిపోయారా..?

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనగానే, వారంతా ఆటోలు ఎక్కరు అనడానికి వీల్లేదు. ఆర్టీసీ బస్సులు ఆలస్యమవుతున్నా, ఆ రూట్ లో బస్సులు లేకపోయినా, బస్సులు రష్ ఎక్కువగా ఉండి ఇబ్బంది ఎదురైనా కచ్చితంగా వారికి ఆటోయే ప్రత్యామ్నాయం. పోనీ మహిళలు అస్సలు బస్సులే ఎక్కరనుకుందాం.. మహిళలతోనే బస్సులు నిండిపోతున్నాయి అనుకుందాం. మరి ఆ స్థానంలో ప్రయాణం చేయాల్సిన పురుషులకు ప్రత్యామ్నాయం ఆటోనే కదా. ఆ రూపేణా వారికి ఆదాయం సమకూరుతుంది కదా. ఈ లాజిక్ లు వినే ఓపిక ఎవరికీ లేదు కానీ, ఆటో డ్రైవర్లపై సింపతీ మాత్రం భారీగా పెరిగిపోయింది.

ఆటో డ్రైవర్లకి కూడా కుటుంబాలుంటాయి. ఆ కుటుంబాల్లో మహిళలుంటారు, ఆ మహిళలు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తుంటారు. అంటే ఆటో డ్రైవర్ల కుటుంబాలు కూడా ప్రభుత్వ ఉచిత రవాణా వల్ల లాభపడుతున్నాయనే చెప్పుకోవాలి. ఈ మాటను ఆటో డ్రైవర్లెవరూ కాదనలేరు కదా. తమ కుటుంబంలోని మహిళలకు ఆ పథకం అక్కర్లేదు అని చెప్పలేరు కదా. ప్రస్తుతానికి కొత్త పథకం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం కొంతమేర పడిపోవడం నిజమే కానీ, మరీ ఉపాధి కరువై, డ్రైవర్లు ఆటోలు బయటకు తీయడంలేదు అనే వార్తలు మాత్రం అవాస్తవం.

కర్నాటకలో కూడా మహిళల ఉచిత ప్రయాణం మొదలయ్యాక ఆటోలు, క్యాబ్ ల డ్రైవర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కానీ, ఇప్పుడు అంతా సద్దుమణిగింది. అవసరం ఉన్నవారు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారు. అర్జంట్ అనుకున్నవారు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఈ వ్యవహారం ఎలా ఉన్నా.. మరికొన్నిరోజులు మీడియా మాత్రం ఆటో డ్రైవర్ల చుట్టూ తిరుగుతుందనడంలో ఆశ్చర్యం లేదు.

*

First Published:  11 Dec 2023 10:48 AM IST
Next Story