Telugu Global
Telangana

పీసీసీ పోస్ట్ రూ.50 కోట్లు.. అసెంబ్లీలో సెటైర్ల పర్వం

కాంగ్రెస్ నేతల కామెంట్స్ పై హరీష్ రావు మరింత ఘాటుగా స్పందించారు. తానేమీ రూ.50 కోట్లు ఇచ్చి పీసీపీ పదవి తీసుకోలేదని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు.

పీసీసీ పోస్ట్ రూ.50 కోట్లు.. అసెంబ్లీలో సెటైర్ల పర్వం
X

తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాడివేడిగా సాగుతున్నాయి. ఈరోజు తెలంగాణ తాజా ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం కేంద్రంగా వాదోపవాదాలు జరిగాయి. శ్వేతపత్రం తప్పులతడక అని, గత ప్రభుత్వంపై తప్పులన్నీ నెట్టేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం అదని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. హరీష్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ కి గంట సమయం ఇచ్చినా సరిపోలేదంటున్నారని, అబద్ధాలను నిజం అని చెప్పడంలో హరీష్ దిట్ట అని విమర్శించారు. హరీష్ రావు ఎన్నేళ్లు కష్టపడినా బీఆర్ఎస్ లో ఆయన సీఎం కాలేరన్నారు.

కాంగ్రెస్ నేతల కామెంట్స్ పై హరీష్ రావు మరింత ఘాటుగా స్పందించారు. తానేమీ రూ.50 కోట్లు ఇచ్చి పీసీపీ పదవి తీసుకోలేదని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు. ఇవి తాను చెబుతున్న మాటలు కాదని, స్వయానా కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలో ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. హరీష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఆయన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే తాను కూడా వెనక్కి తీసుకుంటానన్నారు హరీష్ రావు.

ఈ గొడవలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం ముందు నిరసన తెలిపారు. హరీష్ రావుకి మాట్లాడేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. ఓ దశలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులను పోడియం ముందుకు పంపడం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునవృతం కాకూడదని చెప్పారు. సీనియర్ సభ్యులైన హరీష్ రావు తమ సభ్యులను వారించాలని చెప్పారు స్పీకర్. తాము ప్రతిపక్షంలో పదేళ్లు కూర్చున్నామని, రెండు రోజులకే బీఆర్ఎస్ నేతలు హడావిడి పడుతున్నారెందుకని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శ్వేత పత్రం వ్యవహారం కాస్తా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు, బీఆర్ఎస్ విమర్శలతో సభ అట్టుడికింది.

First Published:  20 Dec 2023 4:00 PM IST
Next Story