నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ.. సమావేశాలు ఎన్నిరోజులంటే..?
సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెడతారని అసెంబ్లీ కార్యదర్శి అజెండా విడుదల చేశారు. సాయన్నకు నివాళులర్పించిన అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఏసీ మీటింగ్ జరుగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ నిర్వహణపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీతోపాటు మండలి సమావేశాలు కూడా మొదలవుతాయి. అసెంబ్లీలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాప తీర్మానం అనంతరం సభ వాయిదా పడుతుంది. సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెడతారని అసెంబ్లీ కార్యదర్శి అజెండా విడుదల చేశారు. సాయన్నకు నివాళులర్పించిన అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఏసీ మీటింగ్ జరుగుతుంది.
సభ ఎన్నిరోజులంటే..?
ఈ అసెంబ్లీకి చివరి సమావేశాలుగా భావిస్తున్న ఈ సెషన్ ఎన్నిరోజులు జరుగుతుంది అనేది బీఏసీ మీటింగ్ లో నిర్ణయిస్తారు. స్పీకర్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొంటారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా లేవని, అందుకే ఈ సెషన్ 3 లేదా 4 రోజుల్లో ముగిసే అవకాశముందని ప్రభుత్వ వర్గాల సమాచారం.
అటు శాసనమండలి కూడా సంతాప తీర్మానం తర్వాత వాయిదా పడే అవకాశముంది. మాజీ ఎమ్మెల్సీ వేదల వెంకటనరసింహాచారి మృతికి మండలి సభ్యులు సంతాపం తెలుపుతారు. అనంతరం ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు, చేపట్టిన సహాయ చర్యలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది, ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. మండలిలో ఈరోజు పలు నివేదికలు ప్రవేశపెడతారని తెలుస్తోంది.