Telugu Global
Telangana

నేటినుంచి తెలంగాణ అసెంబ్లీ.. కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ

ఫిరాయింపులపై ప్రధానంగా అధికార కాంగ్రెస్ ని కార్నర్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఆరు గ్యారెంటీల అమలు, రైతుబంధు, నిరుద్యోగుల సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించే అవకాశముంది.

నేటినుంచి తెలంగాణ అసెంబ్లీ.. కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ
X

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. సభ ప్రారంభం తర్వాత దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత మృతికి సభ సంతాపం తెలుపుతుంది. ఆ తర్వాత వాయిదా పడుతుంది. వాయిదా అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. రేపటినుంచి సభా సమావేశాలు యధావిధిగా కొనసాగుతాయి. ఈనెల 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడతారు.

కేసీఆర్ హాజరు..!

తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ ఇంత వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కాలికి ఆపరేషన్ జరగడంతో ఆయన సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకోవడంతో బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని అంటున్నారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ లేవనెత్తాల్సిన అంశాలు, వ్యూహాలపై ఈరోజు తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా హాజరవుతారని అంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీ ఎంట్రీపై ఈరోజు అధికారిక సమాచారం తెలిసే అవకాశముంది. ఫిరాయింపులపై ప్రధానంగా అధికార కాంగ్రెస్ ని కార్నర్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఆరు గ్యారెంటీల అమలు, రైతుబంధు, నిరుద్యోగుల సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించే అవకాశముంది.

కాంగ్రెస్ వ్యూహమేంటి..?

గత ఏడు నెలల వ్యవధిలో అమలు చేసిన సంక్షేమ పథకాలను అధికారపక్షం అసెంబ్లీలో ప్రస్తావించబోతోంది. జాబ్‌ క్యాలెండర్‌ ని అసెంబ్లీలో ప్రకటించబోతున్నారు. రైతు భరోసా విధివిధానాలపై కూడా ఈ సమావేశాల్లోనే చర్చ జరుగుతుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్ని హైలైట్ చేయాలని ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ సభ్యులు భావిస్తున్నారు.

First Published:  23 July 2024 11:06 AM IST
Next Story