తెలంగాణలో హుక్కా నిషేధం.. అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్‌లో హుక్కా సెంటర్లు బాగా పెరిగాయి. హుక్కా ముసుగులో ఆ సెంటర్లలో మాదకద్రవ్యాల వినియోగం కూడా సాగుతోందని చాలాకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో హుక్కా సెంటర్లపై బ్యాన్ పడింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. హుక్కా సెంటర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్‌మెంట్ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఎలాంటి చర్చలేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
సిగరెట్ కంటే ప్రమాదం!
తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్‌లో హుక్కా సెంటర్లు బాగా పెరిగాయి. హుక్కా ముసుగులో ఆ సెంటర్లలో మాదకద్రవ్యాల వినియోగం కూడా సాగుతోందని చాలాకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. హుక్కా సెంటర్లపై రైడ్స్ చేసి డ్రగ్స్ పట్టుకున్న ఉదంతాలూ ఉన్నాయి. పైగా సిగరెట్ పొగ కంటే హుక్కా ప్రమాదకరమని, యువత దీనికి వ్యసనపరులవుతున్నారని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో మంత్రి చెప్పారు. మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మూతపడనున్న హుక్కా సెంటర్లు
హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని సీఎం రేవంత్ భావించారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. అందుకే బిల్లు ప్రవేశపెట్టామన్నారు. బిల్లు ఆమోదంతో హుక్కాపై నిషేధం అమల్లోకి వచ్చినట్లే. దీంతో హుక్కా సెంటర్లు మూతపడనున్నాయి.