నేడే చివరి రోజు.. అసెంబ్లీలో మూడు బిల్లులు
సభ చివరిరోజైన నేడు మొత్తం నాలుగు బిల్లులకు ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు, ఫ్యాక్టరీల చట్టం సవరణ బిల్లు, రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లులు మాత్రమే ఈరోజు ప్రవేశపెడుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు నేడు. ఈరోజు సభ ముందుకు మూడు కీలక బిల్లులు వస్తున్నాయి. తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు, ఫ్యాక్టరీల చట్టం సవరణ బిల్లు, రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లులను ఈరోజు సభలో ప్రవేశ పెడతారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ సెషన్లో మొత్తం 8 బిల్లులు..
గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మూడురోజులపాటు సభ జరుగుతుందని, మొత్తం 8 బిల్లులు ఈ దఫా అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని బీఏసీ సమావేశం నిర్ణయించింది. గతంలో గవర్నర్ తిప్పి పంపిన నాలుగు బిల్లులను శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. పురపాలక బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టగా.. ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ) బిల్లును మంత్రి హరీష్ రావు సభ ముందుకు తెచ్చారు. ప్రైవేటు వర్సిటీల బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ బిల్లును ఎర్రబెల్లి దయాకర్ రావు సభలో ప్రవేశ పెట్టారు. వాటిని సభ తిరిగి పరిశీలించి, ఆమోదించాలని కోరారు. అనంతరం ఆ బిల్లు లపై సభ్యుల అభ్యంతరాలు తెలపాలన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆ నాలుగు బిల్లులను సభ ఆమోదించినట్టు తెలిపారు.
ఆ ఒక్కటి మిగిలింది..
సభ చివరిరోజైన నేడు మొత్తం నాలుగు బిల్లులకు ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు, ఫ్యాక్టరీల చట్టం సవరణ బిల్లు, రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లులు మాత్రమే ఈరోజు ప్రవేశపెడుతున్నారు. వీటితోపాటు ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించే బిల్లు కూడా సభ ముందుకు రావాల్సి ఉంది. ఈనెల 2వతేదీ బిల్లు ముసాయిదా కాపీని గవర్నర్ కు పంపినా సమాధానం లేదు. సందేహాలంటూ ఆమె సీఎస్ కి లేఖ రాశారు. దీంతో ఆర్టీసీ బిల్లు సందిగ్ధంలో పడింది. మిగిలిన 3 బిల్లులకు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలుపుతుంది.