Telugu Global
Telangana

నాది స్వయంకృషి.. కాదు నీది పేమెంట్ కోటా

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటున్న రేవంత్ రెడ్డి.. రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారా లేక రాహుల్ గాంధీ గురించా అని ప్రశ్నించారు.

నాది స్వయంకృషి.. కాదు నీది పేమెంట్ కోటా
X

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే విషయంపై ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చను తాము సమర్థిస్తున్నామని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోక్ సభలో బీఆర్ఎస్ సభ్యులు లేకపోవడం వల్లే ఈ అన్యాయం జరిగిందని అన్నారాయన. గతంలో తాము కూడా ఇదే చెప్పామని, ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు తత్వం బోధపడిందన్నారు. సవతి తల్లి ప్రేమ, అన్యాయం అంటూ కాంగ్రెస్ సభ్యులు అంటున్నారని, గతంలో తాము కూడా ఇలాగే ఆవేదన వ్యక్తం చేశామన్నారు. తెలంగాణ ఎంపీల విషయంలో 8+8=16 కాలేదని, 8+8=0 అయిందని ఎద్దేవా చేశారు.

ఈ చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. తాను తండ్రులు, తాతల పేర్లు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదని స్వయంకృషితో ఎదిగానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ప్రతినిధిగా తన ప్రస్థానం ప్రారంభించి, శాసన మండలి, శాసన సభ, పార్లమెంట్ వరకు వెళ్లానని, ఇప్పుడు సీఎం అయ్యాయనని వివరించారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటున్న రేవంత్ రెడ్డి.. రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారా లేక రాహుల్ గాంధీ గురించా అని కౌంటర్ ఇచ్చారు. తాను కూడా రేవంత్ రెడ్డిని విమర్శించొచ్చని, ఆయన పేమెంట్ కోటాలో సీఎం సీటు సాధించారని అనొచ్చని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి సహనం ఉండాలని, సభలో రన్నింగ్ కామెంటరీ ఇవ్వడమేంటన్నారు కేటీఆర్.



First Published:  24 July 2024 8:22 AM GMT
Next Story