తెలంగాణలో ఎలక్షన్.. ఏపీ ఉద్యోగులకు సెలవు
సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం వినతి మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేశారు. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు సరైన ఆధారాలు చూపించి సెలవు పొందవచ్చని ఉత్తర్వుల్లో సూచించారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజున(రేపు) తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పలు ప్రైవేటు సంస్థలు కూడా సెలవు ఇచ్చాయి. స్కూళ్లకు ఈరోజు, రేపు రెండు రోజులు సెలవులే. ఉద్యోగులకు సెలవు ఇవ్వని ప్రైవేట్ సంస్థలకు ఈసీ ఈరోజు వార్నింగ్ కూడా ఇచ్చింది. సెలవు ఇవ్వని ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల అధికారులు. ఈ దశలో ఏపీ ప్రభుత్వం కూడా నవంబర్ -30 పెయిడ్ హాలిడేగా ప్రకటించడం విశేషం.
కండిషన్స్ అప్లై..
ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది కానీ, ఇది అందరు ఉద్యోగులకు కాదు. తెలంగాణలో ఓటు హక్కు ఉండి, ఏపీలో ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ సెలవు వర్తిస్తుంది. నవంబర్ -30 వారందరికీ పెయిడ్ హాలిడేగా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అంటే తెలంగాణలో ఓటు ఉండి, ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులు రేపు సెలవు పెట్టి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చనమాట. ఆ సెలవుని పెయిడ్ హాలిడేగా పరిగణిస్తారు. వారికి జీతంలో కోత ఉండదు. అంటే.. ప్రత్యేకంగా సీఎల్, ఈఎల్.. లాంటివి ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదనమాట.
సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం వినతి మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేశారు. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు సరైన ఆధారాలు చూపించి సెలవు పొందవచ్చని ఉత్తర్వుల్లో సూచించారు. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో అనేక మంది ఉద్యోగులకు రెండు రాష్ట్రాలతో సంబంధాలున్నాయి. తెలంగాణలో ఓటు ఉన్నవారు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.