Telugu Global
Telangana

హాఫ్ నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్.. తెలంగాణ అసెంబ్లీలో రచ్చ రచ్చ

"యెస్ యు ఆర్ ఎ హాఫ్ నాలెజ్డ్ ఫెలో" అంటూ కోమటిరెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు హరీష్ రావు. హరీష్ రావుకి వెంటనే మంత్రి వెంకట్ రెడ్డి బదులిచ్చారు.

హాఫ్ నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్.. తెలంగాణ అసెంబ్లీలో రచ్చ రచ్చ
X

తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు మాటల తూటాలు పేలాయి. బడ్జెట్ కేటాయింపులపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మహాలక్ష్మి పథకం కోసం రూ.4వేల కోట్లు కేటాయించారని, అసలు బడ్జెట్ లో దాన్ని తీసివేశారని అన్నారు హరీష్ రావు. ఎక్సైజ్ ఆదాయాన్ని కూడా భారీగా పెంచి చూపించారని, అంటే గల్లీకొక బెల్ట్ షాప్ పెడతారా అని నిలదీశారు. ఇక కాంగ్రెస్ హయాంలో ఆన్నీ ధోకాలేనని చెప్పుకొచ్చారు హరీష్. ఎనిమిది నెలల్లోనే మోసాలన్నీ చూపించారన్నారు. మహిళలకు నెలకు రూ.2500, అవ్వాతాతల పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్ల పెంపు, తులం బంగారం, ప్రతి రోజూ సీఎంప్రజా దర్బార్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, నిరుద్యోగ భృతి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ, డీఏ పెంపు.. వంటి హామీలన్నిటిలో ధోకాయే జరిగిందన్నారు హరీష్ రావు.


మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కూడా హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డికి తాను ఘాటుగా సమాధానం చెప్పగలుగుతాను కానీ సబ్జెక్ట్ డీవియేట్ అవుతుందని ఆగుతున్నానన్నారు. వెంకట్ రెడ్డికి హాఫ్ నాలెడ్జ్ ఉందన్నారు. "యెస్ యు ఆర్ ఎ హాఫ్ నాలెజ్డ్ ఫెలో" అంటూ కోమటిరెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు హరీష్ రావు. హరీష్ రావుకి వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బదులిచ్చారు. హరీష్ రావుకి హాఫ్ నాలెడ్జ్ కూడా లేదని, ఆకారం పెరిగింది కానీ అసలు నాలెడ్జే లేదన్నారు వెంకట్ రెడ్డి. ఆయన ఒక డమ్మీ మంత్రిగా పనిచేశారన్నారు.



దీనికి కొనసాగింపుగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన హాఫ్ నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనికి బీఆర్ఎస్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.


మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఈరోజు రచ్చ రచ్చగా మారింది. బీఆర్ఎస్ తరపున హరీష్ రావు కౌంటర్లివ్వగా, ఆయనపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వెంకట్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. హామీలు అమలు చేయాలని నిలదీస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో మభ్యపెడుతోందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికైనా సిక్స్ గ్యారెంటీస్ పై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

First Published:  27 July 2024 10:46 AM GMT
Next Story