Telugu Global
Telangana

నేటినుంచి తెలంగాణ అసెంబ్లీ.. అస్త్ర శస్త్రాలతో ఇరు వర్గాలు సిద్ధం

తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగిస్తారు, అనంతరం సభ వాయిదా పడుతుంది.

నేటినుంచి తెలంగాణ అసెంబ్లీ.. అస్త్ర శస్త్రాలతో ఇరు వర్గాలు సిద్ధం
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి బడ్జెట్ సెషన్ ఈరోజు నుంచి మొదలవుతోంది. ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా జరిగిన తొలి సమావేశాలు వాడివేడిగా సాగిన నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు మరింత ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. దీంతో అందరి దృష్టి తెలంగాణ అసెంబ్లీ చర్చపైనే ఉంది. అందులోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు, విమర్శల విషయంలో దూకుడుగానే ఉంది. బీఆర్ఎస్ పై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు, వాటికి ప్రతిపక్ష నేతల కౌంటర్లు.. కూడా సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.

షెడ్యూల్ ఇదీ..

తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగిస్తారు, అనంతరం సభ వాయిదా పడుతుంది. రేపు సభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. శాసనసభ కార్యకలాపాల సలహాకమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించి, సభను ఎన్ని రోజులు నడపాలనేది నిర్ణయిస్తారు. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫిబ్రవరి 10న అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అనంతరం బడ్జెట్‌పై సాధారణ చర్చ జరుగుతుంది. బడ్జెట్‌ సమావేశాలు వారం నుంచి 10రోజులు జరిగే అవకాశముంది.

గ్యారెంటీలపై దృష్టి..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలు అమలు చేస్తామన్న కాంగ్రెస్, శాంపిల్ గా రెండు పథకాలను పట్టాలెక్కించింది. మిగతా వాటికి 100రోజుల గడువు విధించింది. తాజాగా మరో రెండు పథకాల అమలుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగతా పథకాల తక్షణ అమలుకోసం ప్రతిపక్షం పట్టుబడుతోంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే.. కోడ్ సాకుగా చూపి కాంగ్రెస్ తప్పించుకుంటుందనేది వారి ప్రధాన ఆరోపణ. గ్యారెంటీలు, వాటి అమలుపై కూడా సభలో రభస జరిగే అవకాశముంది. ఇక సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం, కాళేశ్వరంపై విజిలెన్స్‌ రిపోర్ట్‌, కాగ్‌, ధరణిపై నివేదికలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేఆర్ఎంబీ వ్యవహారం కూడా ఇటీవల రాజకీయ వివాదానికి కారణం అయింది. మొత్తమ్మీద ఈ సమావేశాలు మరింత వాడివేడిగా సాగుతాయనే అంచనాలున్నాయి.

First Published:  8 Feb 2024 6:51 AM IST
Next Story