Telugu Global
Telangana

గిన్నిస్ బుక్ లో రేవంత్.. భట్టికి నోబెల్ ప్రైజ్

కేసీఆర్ ని తిట్టడం, గత ప్రభుత్వాన్ని నిందించడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించడానికే అసెంబ్లీ సరిపోయిందన్నారు ప్రశాంత్ రెడ్డి. మంత్రి కోమటి రెడ్డి తిడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా నవ్వుతూ రాక్షసానందాన్ని పొందారని అన్నారు.

గిన్నిస్ బుక్ లో రేవంత్.. భట్టికి నోబెల్ ప్రైజ్
X

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పోటీపడి మరీ కాంగ్రెస్ సభ్యులు చిల్లర వేషాలు వేశారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అవి బడ్జెట్ సమావేశాలు కావని, బుల్డోజ్ చేసే సమావేశాలని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీ పడ్డారన్నారు. ఒకరిని గిన్నిస్ బుక్ లో ఎక్కించాలన్నారు, మరొకరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. నీఛ స్థాయి, అథమ స్థాయి వేషాలు, హావభావాలు చూపించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని వాడుకున్నారని అన్నారు ప్రశాంత్ రెడ్డి.


అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమానించాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని అన్నారు ప్రశాంత్ రెడ్డి. కేటీఆర్ సాధికారికంగా మాట్లాడుతున్న సందర్భంలో చర్చని పక్కదోవ పట్టించేందుకే సబితా ఇంద్రారెడ్డి పేరు తీసుకొచ్చారని అన్నారు. ఎమ్మెల్యేలు సబిత, సునీత కంటనీరు పెట్టుకున్నారని.. గతంలో ఇలాంటి సన్నివేశాలు ఎక్కడైనా చూశామా అని ప్రశ్నించారు. వారి బాధ చెప్పుకోడానికి కూడా రెండు నిమిషాలు మైక్ ఇవ్వలేదన్నారు. ప్రజా సమస్యలమీద మాట్లాడతామంటే కూడా మైక్ కట్ చేశారని అన్నారు ప్రశాంత్ రెడ్డి.

అసెంబ్లీలో జీరో ఆవర్ మొత్తానికే రద్దు చేశారని, కేవలం 6 రోజులే సమావేశాలు సాగాయని, 16 మంది మంత్రులు మాట్లాడాల్సిన అంశంపై అసలు చర్చే జరగలేదన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ ని తిట్టడం, గత ప్రభుత్వాన్ని నిందించడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించడానికే అసెంబ్లీ సరిపోయిందన్నారు. మంత్రి కోమటి రెడ్డి తిడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా నవ్వుతూ రాక్షసానందాన్ని పొందారని అన్నారు. వెకిలి నవ్వులతో అసెంబ్లీ పరువు తీశారన్నారు.

First Published:  3 Aug 2024 3:00 PM IST
Next Story