Telugu Global
Telangana

సాగులో చరిత్ర తిరగరాసిన తెలంగాణ

స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలన, పథకాల నీడలో నేడు రైతాంగం యావత్ దేశం గర్వించదగ్గ స్థాయిలో నిలబడింది. వ్యవసాయ వృద్ధిలో తెలంగాణ రికార్డుల మోత మోగిస్తోంది.

సాగులో చరిత్ర తిరగరాసిన తెలంగాణ
X

ఉచిత విద్యుత్ క్రెడిట్ గురించి తెలంగాణ రాజకీయాలు వేడెక్కిన వేళ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఎలా ఉంది, నేడు కేసీఆర్ పాలనలో రైతులు ఎలా ఉన్నారనే విషయం చర్చకు వస్తోంది. కొత్తగా ఏదో చేసి చూపెడతామంటున్న పాలకులే నాడు అధికారంలో ఉన్నారు, అప్పటి రైతాంగం ఎన్ని కష్టాలు అనుభవించిందో అందరికీ తెలుసు. స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలన, పథకాల నీడలో నేడు రైతాంగం యావత్ దేశం గర్వించదగ్గ స్థాయిలో నిలబడింది. వ్యవసాయ వృద్ధిలో తెలంగాణ రికార్డుల మోత మోగిస్తోంది. పాడి పెరిగింది, పంట పెరిగింది, నీటి వసతి పెరిగింది, రైతు బంధు ఆసరాగా నిలబడింది, రైతుబాంధవుడిగా కేసీఆర్ జేజేలు అందుకుంటున్నారు.

తెలంగాణ వ్యవసాయం నేడు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొమ్మిదేళ్లుగా వ్యవసాయ రంగంలో గుణాత్మక, పరిమాణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఉనికి కోసం వ్యవసాయం చేసే స్థాయి నుంచి దేశంలోనే తన ఉనికి నిలబెట్టుకునేలా నేడు రాష్ట్రం మారిపోయింది. గ్రామీణ జనాభాలో 60శాతం మందికి పైగా వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

2015-16లో తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తితో పోల్చి చూస్తే 2020-21లో 60శాతం పెరుగుదల కనిపిస్తోంది. వరి ధాన్యం ఉత్పత్తిలో గరిష్టంగా 70శాతం పెరుగుదల ఉంది. 2020-21లో తెలంగాణలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 1,274.5 టన్నులు. విభజనకు ముందు నీటివనరులు, ఇతర సౌకర్యాలు అన్నీ మెండుగా ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని, విభజన తర్వాత తెలంగాణ వెనక్కు నెట్టింది. 2015-16లో తెలంగాణ కంటే ఏపీలో 60శాతం ఎక్కువగా వరి ఉత్పత్తి జరిగేది. 2020-21నాటికి ఏపీ కంటే తెలంగాణ 23 శాతం అధిక ఉత్పత్తిని సాధించింది. వ్యవసాయంలో ఆధునికత మేళవించి అద్భుత ఫలితాలు సాధిస్తున్నందుకు ఇటీవల కేంద్రం కూడా తెలంగాణను ప్రత్యేకంగా ప్రశంసించింది.

విత్తు నుంచి మొదలై..

తెలంగాణలో ఉన్నట్టుండి వ్యవసాయం కొత్తపుంతలు తొక్కలేదు. ప్రణాళికాబద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిని సాధించింది. 2021-22లో రూ.63.69 కోట్ల సబ్సిడీ విలువతో 1.76 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేయడంతో 3,26,927 మంది రైతులకు లబ్ధి చేకూరింది. 2023-24 నాటికి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మొత్తం విత్తనాల పరిమాణం 22.50 లక్షల క్వింటాళ్లు, 182.32 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగుకి ఇది సరిపోతుంది. ఇక ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కోసం ఆన్‌ లైన్ లైసెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (OLMS)ని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.

నిరంతరాయంగా విద్యుత్..

తెలంగాణ రైతు విజయంలో ఉచిత విద్యుత్ పాత్ర కూడా ఉంది. బోరుబావుల ద్వారా సాగు చేసుకుంటున్న రైతులపై అదనపు భారం పడకుండా 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తోంది ప్రభుత్వం. 2023నాటికి తెలంగాణలో 27లక్షల బోర్స్ వెల్స్ ఉన్నాయి. పైసా ఖర్చు లేకుండా రైతులు విద్యుత్ వినియోగించుకుంటూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు.

కొత్త ప్రాజెక్ట్ లతో తొలగిన కన్నీళ్లు..

తెలంగాణ ఏర్పాటైన తర్వాత నూతన సాగునీటి ప్రాజెక్ట్ లు, ఎత్తిపోతల పథకాలు, కొత్తగా తవ్విన కాల్వలు.. తెలంగాణ రైతాంగం కన్నీళ్లు తుడిచాయి. బంజరు భూములు సైతం సస్యశ్యామలంగా మారాయి. పంట విస్తీర్ణం పెరిగింది. దిగుబడి అధికమైంది, తెలంగాణలో రైతే రాజయ్యాడు.

పెట్టుబడికి భరోసా..

అన్ని వసతులు ఉన్నా చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడికోసం ఇబ్బంది పడకుండా రైతుబంధు ఆదుకుంటోంది. రైతుబంధుతోపాటు వ్యవసాయ రుణాలు, రైతుబీమా పథకాలు అన్నదాతలకు అండగా నిలిచాయి. 2018-19 నుండి 2022-23 వరకు 10 సీజన్లలో 65,00,588 మంది రైతులు ఇ-కుబేర్ ప్లాట్‌ ఫామ్, IFMIS ప్లాట్‌ ఫామ్‌ ల ద్వారా 65,190.32 కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు. 2018 నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతుల తరపున బీమా ప్రీమియం చెల్లించింది. దీని విలువ అక్షరాలా రూ. 5,383.83 కోట్లు. 99,297 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ. 5.00 లక్షల చొప్పున మొత్తం రూ. 4964.85 కోట్ల బీమా మొత్తాన్ని చెల్లించి ఆదుకున్నారు. పంట రుణాల మాఫీతో మరింతమందికి ప్రయోజనం కలిగింది.

2014-15లో 27.82 లక్షల మంది రైతులకు రూ. 18,419 కోట్ల వ్యవసాయ రుణాలు పంపిణీ కాగా, 2022-23లో రూ. 46,617.01 కోట్ల రుణాలు 56.41 లక్షల మంది రైతులకు అందించింది ప్రభుత్వం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-15 నుంచి 2017-18 వరకు రూ. 951.28 కోట్లు వెచ్చించి ఏడేళ్లలో 6.71 లక్షల మంది రైతులకు యాంత్రీకరణ ద్వారా లబ్ధి చేకూర్చారు. రూ. 572.22 కోట్ల ఖర్చుతో 2601 రైతు వేదికలను నిర్మించారు. రైతు వేదికల్లో ఇప్పటివరకు 1,11,140 శిక్షణా శిబిరాలు నిర్వహించారు.

ధరణితో కొత్త వెలుగులు..

వ్యవసాయం బాగున్నా.. సాగు భూమి నమోదులో తప్పుడు లెక్కలు ఎప్పుడూ రైతులను చికాకు పెట్టేవి. క్రయ విక్రయాల నమోదులో జరిగిన అవకతవకలు రైతులకు నిద్రలేకుండా చేసేవి. వాటన్నిటికీ శాశ్వత పరిష్కారంగా తీసుకొచ్చిన ధరణి.. రైతులకు ఉపశమనంగా నిలిచింది. ధరణి ద్వారా కొత్త పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయం నష్టాల కొలిమిగా ఉంటే.. నేడు లాభసాటిగా మారింది.

First Published:  16 July 2023 4:20 PM IST
Next Story