ఆయిల్ పామ్ సబ్సిడీపై అసత్య ప్రచారం..
ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు విషయంలో పత్రికల్లో వచ్చిన తప్పుడు కథనాలను నమ్మొద్దని, ప్రతి ఒక్కరికి సబ్సిడీ వస్తుందని చెప్పారు నిరంజన్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న ప్రతి రైతుకి సబ్సిడీ కచ్చితంగా అందుతుందని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఆయిల్ పామ్ సాగులో సబ్సిడీలు ఎత్తివేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అని అన్నారాయన. రుణం తీసుకుని ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు సబ్సిడీ వారి బ్యాంకు ఖాతాలలో జమ అవుతుందనడం ఒక ఆప్షన్ మాత్రమేనన్నారు. ఏ ఒక్కరికీ సబ్సిడీ అందకుండా పోయే అవకాశం లేదన్నారు నిరంజన్ రెడ్డి. రైతులు అసత్య ప్రచారాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పామ్ సాగుచేస్తే ప్రతి ఎకరాకు రూ.49,800 రాయితీగా లభిస్తుందని భరోసా ఇచ్చారు.
ఆయిల్ పామ్ కు డిమాండ్..
మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి. దేశంలో ప్రతి ఏటా వంటనూనెకు 23 లక్షల మెట్రిక్ టన్నుల మేర డిమాండ్ ఉందని, కానీ దేశీయంగా 10నుంచి 11 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెలు మాత్రమే తయారు చేసుకోగలుగుతున్నామని ఆయన వివరించారు. ప్రతి ఏడాదీ 12 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెలను భారత్ దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. దీనికోసం దాదాపు 90వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఖర్చు చేస్తున్నారని అన్నారు. భారత్ ప్రధానంగా థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఈ డిమాండ్ గమనించే.. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రైతులకు శిక్షణ, అవగాహన, రాయితీ..
ఆయిల్ పామ్ సాగు చేయడం వల్ల కలిగే ఉపయోగాలను ముందుగా రైతులకు వివరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత వారికి తగిన శిక్షణ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తోంది. ఇందుకు గాను ఇప్పటి వరకూ 30 వేల మంది రైతులను క్షేత్రస్థాయి సందర్శనలకు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. 2022-23 సంవత్సరంలో 2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయించాలనే ప్రణాళికతో బడ్జెట్ లో వెయ్యికోట్ల రూపాయలు కూడా కేటాయించింది ప్రభుత్వం. వేలాది ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటించింది. నీటి వసతికోసం దీనికి డ్రిప్ సిస్టమ్ అవసరం. డ్రిప్ సిస్టమ్ కోసం 80 నుండి 100 శాతం రాయితీ ఇస్తోంది ప్రభుత్వం. ఇక మొక్కలు నాటేందుకు ఒక్కో మొక్కకి 193 రూపాయల రాయితీ చొప్పున ఎకరానికి 57 మొక్కలకు గాను 11వేల రూపాయలు రాయితీ ఇస్తోంది. ఎకరం డ్రిప్ కోసం 22వేల రాయితీ ఇస్తోంది. నాలుగేళ్లపాటు ఎరువులు, ఇతర అవసరాలకోసం ఎకరానికి రూ.16,800 సబ్సిడీ ఇస్తోంది. ఇలా మొత్తం రైతుకి ఒక ఎకరా ఆయిల్ పామ్ సాగు చేస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం రాయితీ 49,800 రూపాయలన్నమాట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ ని వినియోగించుకుంటే అటు రైతు లాభపడతాడు, ఇటు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఈ ఉద్దేశంతోటే ప్రభుత్వం రాయితీలిచ్చి మరీ రైతుల్ని ప్రోత్సహిస్తోంది.
రైతు బంధు టీఆర్ఎస్ సర్కార్..
ఇక రైతులకోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక నూతన విధానాలను, పథకాలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలోని 26.81 లక్షల బోరు బావులకు ఏడాదికి రూ.10 వేల కోట్ల భారంమోస్తూ 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. ఏడాదికి రూ.1500 కోట్లు రైతుబీమా పథకం కోసం కేటాయిస్తున్నామని అన్నారు. ఏడాదికి రూ.15 వేల కోట్లతో 65 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుబంధు పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఏఈఓలను నియమించామని, రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతువేదికలు నిర్మించామని చెప్పారు. ప్రతి రైతు పంట వివరాలు నమోదు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారాయన. తెలంగాణలో రైతులెవరూ ఆందోళన పడవద్దని, ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు విషయంలో పత్రికల్లో వచ్చిన తప్పుడు కథనాలను నమ్మొద్దని, ప్రతి ఒక్కరికి సబ్సిడీ వస్తుందని చెప్పారు నిరంజన్ రెడ్డి.