Telugu Global
Telangana

తెలంగాణ ఏరోస్పేస్ యూనివర్సిటీకి మా మద్దతు ఉంటుంది.. లాక్‌హీడ్ మార్టిన్ యాజమాన్యం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతిపాదించిన ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటులో తమ పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు.

తెలంగాణ ఏరోస్పేస్ యూనివర్సిటీకి మా మద్దతు ఉంటుంది.. లాక్‌హీడ్ మార్టిన్ యాజమాన్యం
X

అంతర్జాతీయ స్థాయి ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. వాషింగ్టన్‌లో జరిగిన ఏరోస్పేస్, డిఫెన్స్ సెక్టార్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఈ రంగానికి ఉన్న అనుకూలతలు, ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీల గురించి వివరించారు. అనంతరం ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్‌తో సమావేశం అయ్యారు.

లాక్‌హీడ్ మార్టిన్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ బిజినెస్, గ్లోబల్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ రే పిసెల్లీ, ఇంటర్నేషనల్ గవర్నమెంట్ అఫైర్స్ డైరెక్టర్ డేవ్ సట్టాన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే కొనసాగుతున్న వారి కంపెనీ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్స్, భవిష్యత్‌లో చేపట్టబోతున్న ప్రాజెక్టుల గురించి వారు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తమకు ఇస్తున్న తోడ్పాటు, మద్దతును వారు ప్రశంసించారు. కరోనా పాండమిక్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారాన్ని తాము మరువలేమని చెప్పారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతిపాదించిన ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటులో సంస్థ తరపున పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు. లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ త్వరలో తమ సప్లై చెయిన్ సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుండటంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలోని పలు ఎంఎస్ఎంఈ, స్టార్టప్‌లతో భాగస్వామ్యం అవుతూ మంచి ఫలితాలను రాబడుతుండటంపై కూడా మంత్రి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు.

ఎంటీ లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ?

లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ప్రపంచంలోనే దిగ్గజ ఏరోస్పేస్, డిఫెన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఆర్మ్స్, టెక్నాలజీ కార్పొరేషన్ సంస్థ. ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో యుద్ద విమానాల తయారీలో ఈ అమెరికన్ సంస్థ అగ్రగామిగా ఉన్నది. ఇండియాలోని టాటా కంపెనీ భాగస్వామ్యంతో హైదరాబాద్ కేంద్రంగా ఎఫ్-21 ఫైటర్ జెట్లను మాన్యుఫ్యాక్చర్ చేస్తోంది. ఇండియా-యూఎస్ రిలేషన్‌షిప్‌లో భాగంగా భారత వాయు దళానికి అవసరమైన యుద్దవిమానాల తయారీ కోసమే టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనే సంస్థను హైదరాబాద్ కేంద్రగా ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్, ఎన్ఆర్ఐ అఫైర్స్ సెక్రటరీ విష్ణువర్థన్ రెడ్డి, ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు.


First Published:  19 May 2023 3:54 PM IST
Next Story