కాంగ్రెస్ మరో లీకు.. గొర్రెల పథకంలో అవినీతి
2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.4వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన వ్యవహారాాలపై ఓ కన్నేసింది. అవినీతి, అక్రమాలు జరిగాయంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. మేడిగడ్డకు ఆల్రడీ మరమ్మతులు జరుగుతున్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో తీవ్ర వాదోపవాదాలు మొదలయ్యాయి. తాజాగా గొర్రెల పంపిణీ పథకంపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేస్తోంది. ఈ పథకంలో 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. తాజాగా ఏసీపీ అభికారులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించినట్టు చెబుతున్నారు. కొంతమంది అధికారుల్ని కూడా ఏసీబీ అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది.
బీఆర్ఎస్ హయాంలో పశుగణాభివృద్ధి సంస్థకు సీఈవోగా, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు ఎండీగా పనిచేసిన రాంచందర్ నాయక్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాజీ ఓఎస్డీ గుండమరాజు కల్యాణ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 10మంది నిందితులను గుర్తించగా, ఆరుగురిని అరెస్టు చేశారు. ఏకంగా సీఈవో స్థాయి అధికారి, మాజీ మంత్రి మాజీ ఓఎస్డీ అరెస్ట్ కావడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. మరికొందరు పెద్దల పాత్ర కూడా ఈ కుంభకోణంలో ఉందనే ఆరోపణలు వినపడుతున్నాయి.
2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.4వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలున్నాయి. ఈ క్రమంలో లబ్ధిదారుల పేరు చెప్పి కొన్ని ప్రాంతాల్లో నిధులు స్వాహా చేసినట్టు ఆరోపణలున్నాయి. గొర్రెల అమ్మకం దారులకు డబ్బులు చెల్లించినట్టు దొంగ బిల్లులు సృష్టించి ఆ నిధుల్ని దారి మళ్లించారని అంటున్నారు. ఈ కేసులో ఇప్పుడు విచారణ వేగవంతమైంది. ఉద్దేశపూర్వకంగానే కొంతమంది అధికారుల్ని ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ నుంచి ఆరోపణలు వినపడుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక, గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. అందుకే ఇలా కుంభకోణాలంటూ లీకులిస్తున్నారని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు.