Telugu Global
Telangana

'కంటి వెలుగు' కార్యక్రమం గిన్నిస్ రికార్డుల లోకి ఎక్కనుందా ?

కంటి వెలుగు రెండో దశలో రాష్ట్రంలోని 3 కోట్ల మందికి స్క్రీనింగ్‌ చేయనున్నట్టు హరీశ్‌ రావు స్పష్టం చేశారు.బుధవారం జగిత్యాలలో జరగాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు జగిత్యాల వచ్చిన మంత్రి మంగళవారం ఇక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో కంటివెలుగుపై సమీక్ష నిర్వహించారు.

కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్ రికార్డుల లోకి ఎక్కనుందా ?
X

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవాలని ఆరోగ్య, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. రికార్డు సాధించేందుకు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సహా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

కంటి వెలుగు రెండో దశలో రాష్ట్రంలోని 3 కోట్ల మందికి స్క్రీనింగ్‌ చేయనున్నట్టు హరీశ్‌ రావు స్పష్టం చేశారు.బుధవారం జగిత్యాలలో జరగాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు జగిత్యాల వచ్చిన మంత్రి మంగళవారం ఇక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో కంటివెలుగుపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని, పేదల సంక్షేమమే ధ్యేయంగా నిర్వహించే కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు చురుగ్గా పాల్గొనాలని కోరారు.

కంటి వెలుగు మొదటి దశ ఎనిమిది నెలల పాటు కొనసాగిందని, రెండో దశను వంద రోజుల పనిదినాల్లో పూర్తి చేయాలన్నారు. అందుకోసం పరీక్ష బృందాల సంఖ్యను 827 నుండి 1,500 కు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రజలందరికీ ఉచితంగా అద్దాలు అందించబడతాయి. 30 లక్షల రీడింగ్, 25 లక్షల ప్రిస్క్రిప్షన్ గ్లాసులు సరఫరా అవుతాయని, కార్యక్రమం ప్రారంభించేలోపు జిల్లాలకు అద్దాలను తరలించే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు హరీష్ రావు సూచించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కార్యక్రమం గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, కంటి వెలుగు పథకంపై మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాల్లో అధికారులు చర్చించాలన్నారు. జిల్లా మైక్రో ప్లానింగ్‌ పూర్తయిన తర్వాత జిల్లా ఇన్‌చార్జి మంత్రులు జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి తమ జిల్లాలో కంటి పరీక్ష శిబిరాలు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేయాలన్నారు.

సిబ్బంది కొరతను నివారించేందుకు ఐదు శాతం బఫర్‌ టీమ్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. పది రాష్ట్ర స్థాయి క్వాలిటీ కంట్రోల్ టీమ్‌లతో పాటు, కంటి పరీక్షల నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి నాణ్యత నియంత్రణ బృందాలను కూడా ఏర్పాటు చేస్తారు. శిబిరాలకు హాజరుకాని వారికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

కంటి వెలుగు విజయవంతంగా అమలు చేసేందుకు వైద్యుల కొరతపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. వారం రోజుల్లో 960 మంది వైద్యులను నియమించనున్నామని, వైద్యుల కొరత లేదని స్పష్టం చేశారు.

First Published:  7 Dec 2022 8:04 AM IST
Next Story