Telugu Global
Telangana

తెలంగాణ కాంగ్రెస్‌లో 'టీడీపీ' చిచ్చు

కమిటీలో మొత్తం రేవంత్ తన అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చారని.. అందులో మొత్తం టీడీపీ వాళ్లే ఉన్నారన్నది కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల ఆరోపణ. ఇవాళ ఏకంగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా సమావేశమై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో టీడీపీ చిచ్చు
X

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. 'చంద్రబాబు మనిషి' అనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇక రేవంత్ కూడా.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినా.. ఎప్పుడూ తన స్వామి భక్తిని దాచుకోలేదు. అవకాశం చిక్కినప్పుడల్లా ఆయన చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ఆయనలో టీడీపీ వాసనలు పోలేదన్న ఆరోపణలకు ఊతమిస్తూ ఉంటారు. కాగా, ఇటీవల తెలంగాణ పీసీసీ కమిటీలపై ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ కమిటీలో మొత్తం రేవంత్ తన అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చారని.. అందులో మొత్తం టీడీపీ వాళ్లే ఉన్నారన్నది కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల ఆరోపణ. ఇవాళ ఏకంగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా సమావేశమై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఒరిజినల్ కాంగ్రెస్, బయట నుంచి వచ్చిన కాంగ్రెస్ అంటూ వాళ్లు కొత్త చర్చకు తెరతీశారు. ఈ పరిణామం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో భారీ కుదుపుగా మారింది. ఈ ఘటనపై ఇంతవరకు రేవంత్ మాట్లాడలేదు. నిజానికి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం వద్ద గట్టి పలుకుబడే ఉన్నట్టుంది. అయితే మరి సీనియర్ల వాదనను వారు పరిగణనలోకి తీసుకుంటారా..? వారికి ఉపశమనం కలిగించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటారా..? అన్నది వేచి చూడాలి.

ఇదిలా ఉంటే.. తమను కోవర్టులు అనడంపై కూడా కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతలు తీవ్రంగా నొచ్చుకున్నారు. మీడియాలో రేవంత్ రెడ్డే.. తమ మీద కోవర్టులుగా ముద్రవేస్తూ ప్రచారం చేయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మంచి జోష్‌తో దూసుకుపోతున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పరిణామం జరగడం గమనార్హం.

తాజాగా ఈ విషయంపై రేవంత్ వర్గానికి చెందిన మల్లు రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేతలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొత్త కమిటీల్లో టీడీపీ వాళ్లు ఎక్కువగా లేరని చెప్పేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను బుజ్జగించో.. బ‌తిమిలాడో.. రేవంత్ తన వైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేయాలి. కానీ, పరిస్థితి చూస్తుంటే ఆయన కాస్త ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు ఉన్నాయో.. తెలియదు. మొత్తంగా ఇవాళ జరిగిన పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఓ కుదుపనే చెప్పాలి. దీన్ని హైకమాండ్ ఎలా డీల్ చేస్తుందో.. వేచి చూడాలి.

First Published:  17 Dec 2022 2:01 PM GMT
Next Story