Telugu Global
Telangana

తెలంగాణలో పూర్వ వైభవం సాధ్యమేనా?

ఈ నెల 21వ తేదీన అంటే బుధవారం ఖమ్మంలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు హాజరయ్యే ఈ సభతో పార్టీకి పూర్వ వైభవం వచ్చేస్తుందని కాసాని చాలా బలంగా నమ్ముతున్నారు.

తెలంగాణలో పూర్వ వైభవం సాధ్యమేనా?
X

కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న సామెత తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు సరిగ్గా సరిపోతుంది. కాసాని ఈ మధ్యే పార్టీకి అధ్యక్షుడయ్యారు. అప్పటి నుండి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామంటు చెప్పుకుని తిరుగుతున్నారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం ఎలా తీసుకొస్తారని అడిగితే మాత్రం మళ్ళీ సమాధానం ఉండదు. పూర్వ వైభవం, పూర్వ వైభవం అనే పదాలను చిలకపలుకుల్లా పలుకుతూ మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు.

ఈ నెల 21వ తేదీన అంటే బుధవారం ఖమ్మంలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు హాజరయ్యే ఈ సభతో పార్టీకి పూర్వ వైభవం వచ్చేస్తుందని కాసాని చాలా బలంగా నమ్ముతున్నారు. పార్టీకి పూర్వవైభవం రావాలంటే ఏం చేయాలి? ఇతర పార్టీలపై ముఖ్యంగా అధికార బీఆర్ఎస్‌పై పోరాటాలు చేయాలి. ప్రభుత్వంపై పోరాటాలు చేస్తేనే అధికార పార్టీపై అసంతృప్తిగా ఉన్న జనాలు పోరాటాలు చేసే పార్టీ వైపు ఆకర్షితులవుతారు.

కానీ ఇక్కడ చంద్రబాబుకు అసలు పోరాటాలు చేసే ఆలోచనే లేదే. చంద్రబాబు ఏ పార్టీ మీద పోరాటం చేస్తారు? కేసీఆర్‌ పేరెత్తాలంటేనే భయపడిపోతున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టుకు భయపడే కదా ఎనిమిదేళ్ళ క్రితం అర్ధాంతరంగా హైదరాబాద్‌ను వదిలి విజయవాడ పారిపోయింది. అప్పటి నుండి కేసీఆర్ పేరెత్తటానికే చంద్రబాబు ఇష్టపడటం లేదు. ఇక బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న కారణంగా కమలం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశమే లేదు. మిగిలిన కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఎలాగూ చంద్రబాబు శిష్యుడే.

రేవంత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి కూడా స్వామి భక్తిని ప్రదర్శిస్తునే ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ గురించి మాట్లాడే ఛాన్స్ లేదు. వామపక్షాల్లో సీపీఐ ఎటూ చంద్రబాబు ఫోల్డులోనే ఉంది. సో ఏరకంగా చూసుకున్నా టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం కాదు కదా లేచి నిలబడే సీన్ కూడా లేదు. తెలంగాణలో పార్టీకి ఈ పరిస్ధితి రావటం చంద్రబాబు స్వయంకృతమే. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మీద రెచ్చిపోతున్నట్లుగా తెలంగాణలో మీడియా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఏమీ రెచ్చిపోవటంలేదు. ఖమ్మం బహిరంగసభతోనే కాసాని చెబుతున్న పార్టీ భవిష్యత్తు ఏమిటో తేలిపోతుంది. చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

First Published:  20 Dec 2022 12:00 PM IST
Next Story