Telugu Global
Telangana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం దగ్గరవుతున్న టీడీపీ, బీజేపీ?

తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు టీడీపీకి సంస్థాగతంగా భారీగానే ఓట్లు ఉండేవి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్ పార్టీలు పోటీ చేశాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం దగ్గరవుతున్న టీడీపీ, బీజేపీ?
X

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలల్లో నోటిఫికేషన్ వెలువడనున్నది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా డిక్లరేషన్ల పేరుతో ఎన్నికల హడావిడిని ప్రారంభించింది. ఇక తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీలో మాత్రం కాస్త స్తబ్దత నెలకొన్నది.

రాష్ట్ర బీజేపీలో వర్గ విభేదాలు బయటపడతంతో పాటు, కర్ణాటక ఫలితాల తర్వాత ఆ పార్టీలో చేరడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరతారని కొండంత ఆశ పెట్టుకున్నా.. వాళ్లు మాత్రం బీజేపీకి దూరంగానే ఉంటున్నారు. ఇక చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్పించడంలో విఫలమయ్యారు. దీంతో ఎన్నికలకు ఎలా వెళ్లాలనే విషయంపై అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే పలు సర్వేలు చేయించిన బీజేపీ హైకమాండ్..80 నుంచి 90 నియోజకర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులే లేరని తెలుసుకున్నది.

తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు టీడీపీకి సంస్థాగతంగా భారీగానే ఓట్లు ఉండేవి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్ పార్టీలు పోటీ చేశాయి. అప్పుడు తెలుగుదేశం రెండు సీట్లు గెలుచుకున్నది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో టీడీపీ ఇప్పటికీ బలం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి లబ్ది చేకూరుతుందని హైకమాండ్ భావిస్తున్నది. హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు భేటీలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తున్నది.

తెలంగాణలో గ్రామస్థాయిలో టీడీపీకి ఉన్న క్యాడర్‌ను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికిప్పుడు సొంతగా క్యాడర్‌ను తయారు చేసుకోవడంలో ఇబ్బందులు ఉండటం వల్లే.. టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రూపంలో అవకాశం రావడంతో.. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదులుకోవద్దని అనుకుంటున్నారు.

టీడీపీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పెద్దగా పని లేదు. ఆ పార్టీ ఆసక్తి అంతా ఏపీపైనే. అందుకే తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తే.. ఏపీలో తమకు ఉపయోగపడుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అయితే, వైసీపీకి నష్టం చేకూరేలా బీజేపీ పొత్తులు ఉండవని.. టీడీపీని కేవలం తెలంగాణకే పరిమితం చేస్తారనే చర్చ కూడా జరుగుతున్నది. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉండటం కంటే.. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఉండటమే బీజేపీకి కావలసింది. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నా.. దాన్ని తెలంగాణ వరకే పరిమితం చేయవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మొదటి దశ చర్చలు మాత్రమే జరిగాయని.. రాబోయే రోజుల్లో తెలంగాణలో పొత్తుపై ఒక స్పష్టత వస్తుందని తెలుస్తున్నది.

First Published:  5 Jun 2023 3:01 PM IST
Next Story