టార్గెట్ బీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి వ్యూహం
ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తోంది బీజేపీ. అటు కాంగ్రెస్ కూడా లోక్ సభ ఎన్నికల వేళ కేంద్రంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని టార్గెట్ చేయాల్సింది పోయి, బీఆర్ఎస్ నే ప్రధాన శత్రువుగా ఎంపిక చేసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్.. సహజంగానే లోక్ సభ ఎన్నికల్లో ఆ స్థాయి ఫలితాలనే ఆశిస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం అంతకు మించి అంటూ భారీ డైలాగులు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13నుంచి 14 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అక్కడితో ఆగలేదు, బీఆర్ఎస్ కి కనీసం ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. అంటే బీజేపీ, ఎంఐఎంకి మిగతా సీట్లు వచ్చినా బీఆర్ఎస్ కనుమరుగవుతుందనేది కాంగ్రెస్ ఆలోచన.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు బాగా తగ్గించేశారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తోంది బీజేపీ. అటు కాంగ్రెస్ కూడా లోక్ సభ ఎన్నికల వేళ కేంద్రంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని టార్గెట్ చేయాల్సింది పోయి, బీఆర్ఎస్ నే ప్రధాన శత్రువుగా ఎంపిక చేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని పూర్తిగా దెబ్బతీయాలనే ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గేలమేస్తోంది, బీఆర్ఎస్ లోని సిట్టింగ్ ఎంపీలు, ఎంపీ టికెట్ ఆశిస్తున్నవారికి బీజేపీ గేలమేస్తోంది. ఈ ఐదేళ్లలో ఉమ్మడిగా బీఆర్ఎస్ ని ఖాళీ చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. గత బీఆర్ఎస్ పథకాలన్నిటిపై విచారణల పేరుతో కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో లిక్కర్ స్కామ్ పేరుతో కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ ఇప్పటికే టార్గెట్ చేసింది. లోక్ సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ బలాన్ని మరింత తగ్గించాలనేది కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి ప్రణాళిక.
కేసీఆర్ వ్యూహం ఏంటి..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ డీలాపడ్డ మాట వాస్తవమే అయినా లోక్ సభ ఎన్నికల్లో పుంజుకోవాలని ఆ పార్టీ ఆశపడుతోంది. తెలంగాణలో పట్టు నిలుపుకోగలిగితేనే బీజేపీ, కాంగ్రెస్ పై ఎదురుదాడి చేసే అవకాశముంటుంది. అందుకే లోక్ సభ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది గులాబిదళం. కేసీఆర్ కూడా వరుస సమీక్షలతో బిజీ అవుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకుని తెలంగాణలో పట్టు నిలుపుకోవాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి మరింత బలం పుంజుకోవాలనేది ఆయన ఆలోచన.