కూనంనేనికి కలిసొచ్చింది... తమ్మినేనికి ఎదురుతన్నింది
మేం అడిగినన్ని సీట్లియాల్సిందే అని మొండికేసి మరీ పోటీకి దిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేవలం నాలుగు వేల ఓట్లు తెచ్చుకుని ఘోర పరాజయం పాలయ్యారు.
రాజకీయాల్లో పట్టూ విడుపూ ఉండాలి. ఒకచోట పోగొట్టుకుంటున్నా మరోచోట రాబట్టుకునే నేర్పు ఉండాలి. ఆ సూత్రం తెలిసినవాళ్లే రాజకీయాల్లో ముఖ్యంగా పొత్తు రాజకీయాల్లో పైకి వస్తారు. ఆ సూత్రం ఒంటబట్టించుకుని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే కాగలిగారు. ఠాఠ్ మేం అడిగినన్ని సీట్లియాల్సిందే అని మొండికేసి మరీ పోటీకి దిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేవలం నాలుగు వేల ఓట్లు తెచ్చుకుని ఘోర పరాజయం పాలయ్యారు.
ఒక ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీల ప్రతిపాదన
ఈ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకుంటే సీపీఎం, సీపీఐలకు ఒక్కో పార్టీకి చెరో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, అధికారంలోకి వచ్చాక రెండు పార్టీలకు చెరో రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. దీనికి సీపీఐ సరే అంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి కొత్తగూడెం టికెట్ ఇప్పించుకుంది. కానీ సీపీఎం మాత్రం పట్టువీడలేదు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మొండిపట్టు పట్టి ఏకంగా 20 స్థానాల వరకు అభ్యర్థులను నిలబెట్టారు. తమ అభ్యర్థులను గెలిపించుకోవడం అటుంచి, తానే నాలుగు వేల ఓట్లకు పరిమితమై తమ్మినేని అవమానపడ్డారు.
వ్యక్తిగత స్వార్థమే మిన్న అయిపోయిందా?
వాస్తవానికి తమ్మినేని కూడా ఒక ఎమ్మెల్యే టికెట్ ప్రతిపాదనకు అంగీకరించారు. అయితే ఆ ఒక్క టికెట్ పాలేరులో తనకే ఇవ్వాలని తమ్మినేని పట్టుబట్టారు. పాలేరులో ఫైట్ టఫ్‌గా ఉండబోతోందని, కాంగ్రెస్ నేత పొంగులేని శ్రీనివాసరెడ్డి అయితేనే అక్కడ గెలుస్తారని నమ్మిన కాంగ్రెస్ ఆ సీటు ఇవ్వడానికి నిరాకరించింది. కానీ పార్టీ భవిష్యత్తు కంటే తన టికెటే ముఖ్యమని తమ్మినేని వీరభద్రం పొత్తు పొడవనివ్వలేదు. ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించేశారు. చివరి నిమిషం వరకు జానారెడ్డి లాంటి సీనియర్ నేతలు బుజ్జగించినా వీరభద్రం తన సొంత ప్రయోజనాల కోసమే చూసుకుని ఇప్పుడు తాను మునిగి, పార్టీనీ ముంచేశారు.
చట్టసభల్లో చోటు లేనట్లే
సీపీఐ నేత కూనంనేని కొత్తగూడెం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. మరోవైపు పొత్తులో భాగంగా రెండు ఎమ్మెల్సీ సీట్లు కూడా దక్కితే శాసనమండలిలోనూ ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ సీపీఎం అటు అసెంబ్లీలో ఓడిపోయి, ఇటు మండలికీ వెళ్లలేక రెండింటికీ చెడ్డ రేవడి అయింది. మొత్తంగా ఈ దఫా చట్టసభల్లో చోటులేకుండా మిగిలింది.
♦