ఆస్కార్ కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు..! ఆర్ఆర్ఆర్ పై తీవ్ర విమర్శలు..
ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ 80కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బుతో తాము 8 సినిమాలు తీసి ముఖాన కొడతామని అన్నారాయన.
ఆస్కార్ బరిలో నిలిచిన తెలుగు సినిమాగా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయింది ఆర్ఆర్ఆర్. దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, నాటు-నాటు పాట రచయిత చంద్రబోస్ సహా.. ఇతర టీమ్ కి అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ వచ్చింది. అయితే అదే సమయంలో ఆస్కార్ సాధించడం కోసం ఈ సినిమా యూనిట్ కోట్ల రూపాయలు ప్రమోషన్ కి ఖర్చు పెట్టిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ప్రమోషన్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ 80కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బుతో తాము 8 సినిమాలు తీసి ముఖాన కొడతామని అన్నారాయన.
ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమానే కానీ, విదేశీ అవార్డుల విషయంలో మరింత ప్రమోషన్ అయితే కావాల్సిందే. ఆర్ఆర్ఆర్ విషయంలో దర్శకుడు రాజమౌళి ముందుగానే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ కి విదేశీ మీడియాలో కూడా ప్రమోషన్ దంచికొట్టారు. ఈ వ్యవహారాలన్నీ రాజమౌళి తనయుడు కార్తికేయ చూసుకున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత ఓ పంపిణీ సంస్థతో ఒప్పందం చేసుకుని అమెరికాలో కొన్ని స్పెసిఫిక్ థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేశారు. చిత్ర యూనిట్ కూడా సినిమా ప్రదర్శనలకు వెళ్లింది, ప్రేక్షకుల్ని పలకరించింది, ఇంటర్వ్యూలిచ్చింది. నాటు-నాటుకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఆర్ఆర్ఆర్ పేరు మరింత మారుమోగిపోయింది. ఇప్పుడు ఆస్కార్ కి దగ్గరైంది. ఈ దశలో సాటి తెలుగు దర్శకుడు తమ్మారెడ్డి ఆర్ఆర్ఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం సంచలనంగా మారింది.
“ఇప్పుడు వచ్చే ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆ డబ్బుతో మేము 8 సినిమాలు తీసి ముఖాన కొడతాం. కేవలం వారు ఫ్లైట్ టికెట్స్ కోసమే కోట్లు ఖర్చుపెడుతున్నారు. మేము సమాజాన్ని మార్చాలని సినిమాలు తీయడం లేదు. మాకు నచ్చి సినిమాలు తీస్తున్నాం. సమాజంలో మార్పుకోసం ప్రయత్నిస్తాం కానీ, సమాజాన్ని ఉద్దరించడానికే మేము పుట్టలేదు” అంటూ ఓ ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు తమ్మారెడ్డి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
భారీ బడ్జెట్ సినిమాలు, వాటి ప్రమోషన్లు అనే టాపిక్ పైనే తమ్మారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కానీ, ఆయన ఆర్ఆర్ఆర్ ని కానీ, దర్శకుడు, హీరోలను కానీ కించపరచలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తమ్మారెడ్డి వ్యాఖ్యలు విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిందని, ఇప్పుడు ఆ సినిమాని, వారి ప్రయత్నాన్ని కించపరిచేలా తోటి దర్శక నిర్మాత మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అన ప్రశ్నిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరపున ఎవరూ దీనిపై స్పందించలేదు. బహుశా ఆస్కార్ వేడుక అయిపోయాక కచ్చితంగా తమ్మారెడ్డికి కౌంటర్ ఇస్తారేమో.