తమ్మారెడ్డి ఆస్కార్ రియాక్షన్.. ఎన్టీఆర్, చరణ్ పేర్లు మిస్సింగ్
ఇప్పుడు తమ్మారెడ్డి కూడా వ్యూహాత్మకంగానే ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు మెన్షన్ చేయలేదు. రాజమౌళి పేరు కూడా చివర్లో మొహమాటానికే చెప్పినట్టుంది.
80కోట్లు ఖర్చు పెట్టి ఆస్కార్ కోసం ప్రమోషన్ చేసుకున్నారని, ఆ డబ్బులు తనకి ఇస్తే 8 సినిమాలు తీసి మొహాన కొడతానంటూ ఆమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగబాబు కౌంటర్, దానికి తమ్మారెడ్డి రియాక్షన్ కూడా టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. అయితే అదే తమ్మారెడ్డి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ వచ్చాక స్పందించారు. ఆ స్పందనలో కూడా ఆయన తన మార్క్ చూపించారు.
సంగీతం, సాహిత్యం హైలెట్..
నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం తనకు సంతోషంగా, గర్వంగా ఉందన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. సినిమాని, సినిమా సంగీతాన్ని ప్రేమించేవారందరికీ ఈ అవార్డ్ గర్వకారణమేనన్నారు. తెలుగు సినిమాల్లో తెలుగు సంగీతంలో తెలుగుదనాన్ని ఇంకా కొనసాగిస్తున్నవారిలో కీరవాణి ఒకరని, పాటలు అద్భుతంగా రాసేవారిలో చంద్రబోస్ ఒకరని గుర్తు చేశారు. వారి కాంబినేషన్లో వచ్చిన సినిమా పాటకి ఆస్కార్ రావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సినిమాకి ఫస్ట్ టైమ్ రావడం అద్భుతం అని కొనియాడారు.
చరణ్, ఎన్టీఆర్ పేర్లు ఎందుకు చెప్పలేదు..?
ఆమధ్య తమ్మారెడ్డి వ్యాఖ్యలతో హీరో రామ్ చరణ్ బాబాయ్ నాగబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అటు ఎన్టీఆర్ తరపున ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు, సోషల్ మీడియాలో ఘాటుగా బదులిచ్చారు. వాస్తవానికి ఈ అవార్డ్ కి, హీరోలకు సంబంధం లేదని కూడా సోషల్ మీడియాలో కొంతమంది విమర్శిస్తున్నారు. అవార్డ్ అందుకున్నవారు కీరవాణి, చంద్రబోస్ అయితే.. ప్రమోషన్ అంతా రామ్ చరణ్, ఎన్టీఆర్ చుట్టూ జరిగిందని, ఇదెక్కడి చోద్యం అంటున్నారు. ఇప్పుడు తమ్మారెడ్డి కూడా వ్యూహాత్మకంగానే ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు మెన్షన్ చేయలేదు. రాజమౌళి పేరు కూడా చివర్లో మొహమాటానికే చెప్పినట్టుంది. క్రెడిట్ అంతా పూర్తిగా కీరవాణి, చంద్రబోస్ కే ఇచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ. తమ్మారెడ్డి రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది.