Telugu Global
Telangana

తెలుగు అక్షరాలతో కేటీఆర్ చిత్రం.. తమిళనాడు అభిమాని ప్రతిభ

తమిళనాడుకు చెందిన తిరు గణేష్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. స్వతహాగా చిత్రకారుడైన గణేష్.. వినూత్నంగా తెలుగు అక్షరాలతో కేటీఆర్ చిత్రాన్ని గీశాడు.

తెలుగు అక్షరాలతో కేటీఆర్ చిత్రం.. తమిళనాడు అభిమాని ప్రతిభ
X

తెలంగాణ మంత్రి కేటీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తండ్రి కేసీఆర్ వెంట నడిచిన కేటీఆర్.. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రిగా సేవలు అందిస్తున్నారు. తండ్రి చాటు కొడుకు నుంచి.. ఇవ్వాళ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కేటీఆర్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అప్పడప్పుడూ తమ అభిమానాన్ని కేటీఆర్‌పై చాటుకుంటూనే ఉంటారు.

తమిళనాడుకు చెందిన తిరు గణేష్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌పై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చూపించాడు. స్వతహాగా చిత్రకారుడైన గణేష్.. వినూత్నంగా తెలుగు అక్షరాలతో కేటీఆర్ చిత్రాన్ని గీశాడు. అద్భుతమైన ఆ చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. 'కేటీఆర్ సార్.. నేను గణేష్. తమిళనాడుకు చెందిన వ్యక్తిని. 6 ఏళ్లలో 17 ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఇది ఆల్ టైం రికార్డు. ఇలాంటి బొమ్మ గీయడం ఇదే తొలిసారి. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా #SRDP #HappeningHyderabad అంటూ ట్యాగ్ కూడా చేశారు.

ఇటీవల హైదరాబాద్‌లో ఎస్‌ఆర్డీపీ కింద అనేక ఫ్లైవోవర్లను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నగర ముఖ చిత్రమే మారిపోతోంది. మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ సిటీపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. విశ్వనగరంగా మార్చడానికి కావల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర మెట్రోలకు ధీటుగా హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు ఇస్తోంది. అందుకే ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక ఉన్న కేటీఆర్ అంటే అభిమానం చూపిస్తున్నారు.

గణేష్ గీసిన చిత్రాన్ని కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఇది ఒక అరుదైన కళగా అభివర్ణించారు. చిత్రాన్ని గీసినందుకు చాలా థ్యాంక్స్ అని కేటీఆర్ చెప్పారు.



First Published:  2 Dec 2022 12:50 PM IST
Next Story